కర్నూలు: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు చేసిన మోసం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్ధుల్ హఫీస్ ఖాన్ మండిపడ్డారు. కర్నూలు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల పట్ల తెలుగుదేశం నమ్మకద్రోహంకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీల విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేక వైఖరి ఈ బిల్లు విషయంలో మరోసారి బయపడిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల హక్కులను కాపాడటంపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది వెల్లడయ్యింది. దేశం మొత్తం ముస్లిం సమాజానికి ఆయన నిజస్వరూపం తెలిసిపోయింది. 9 లక్షల ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డ్ తన హక్కులను కోల్పోయే పరిస్థితికి కారణమయ్యే ఈ బిల్లును చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇంత కుట్ర జరుగుతుంటే నలబై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు? కేంద్రం మొత్తం నితీష్, చంద్రబాబుల మద్దతుపైనే ఆధారపడి ఉంది. కీలకమైన సంఖ్యాబలం ఉన్న చంద్రబాబు ప్రారంభంలోనే ఈ బిల్లును అడ్డుకుని ఉంటే, జేపీసీ దాకా బిల్లు వెళ్ళేదా? ఒకవైపు రాష్ట్రంలో ముస్లింలకు మాయమాటలతో వక్ఫ్ సవరణలో వారికి ఎటువంటి అన్యాయం జరగదంటూ మోసపు హామీలు ఇచ్చారు. మరోవైపు కేంద్రంలో బిల్లుకు మద్దతు పలికి, ఆమోదంకు మార్గం సుగమం చేశారు. ఇదే క్రమంలో జాతీయ మీడియాలో వక్ఫ్ బిల్లును చంద్రబాబు అడ్డుకుంటున్నాడంటూ మరో అబద్దపు ప్రచారం ఘనంగా చేయించుకున్నారు. రెండు నాలుకల దోరణితో ముస్లింలను మాయ చేయాలని చంద్రబాబు అనుకున్నారు. గోద్రా అలర్ల తరువాత నేను మారిన మనిషిని, మైనార్టీల పట్ల అనుకూలంగా ఉంటాను, నాకు అవకాశం ఇవ్వాలని మభ్యపెట్టారు. రాష్ట్రంలో అన్నిచోట్లా ముస్లిం సమాజం ఈ మాటలు నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారు. కనీసం రాజ్యసభలో అయినా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఈ బిల్లును అడ్డుకోవాలి. వైయస్ఆర్‌సీపీ ఈ బిల్లును ప్రజాస్వామ్య విధానాల్లో అడ్డుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైయస్ జగన్ గారు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంను తిప్పికొట్టాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడం దారుణం బీజేపీ ఏనాడూ ముస్లీంలకు అనుకూలంగా వ్యవహరించలేదు. ఎన్డీఏ పాలనలో ముస్లీం మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించలేదు. సంఖ్యాబలం ఉందని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ అన్ని అభ్యంతరాలను పక్కకుపెట్టి వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించారు. ఆల్‌ఇండియా ముస్లీం పర్సనల్ బోర్డ్, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామిక్ హింద్, సునతుల్ జమాత్ వంటి సంస్థలు కూడా ఈ బిల్లును వ్యతికించాయి. దీనివల్ల మైనార్టీలు నష్టపోతారని ముక్తకంఠంతో చెప్పాయి. అయినా కూడా కేంద్రప్రభుత్వం ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. వక్ఫ్ బోర్డ్‌లో కొత్తగా మహిళలకు అవకాశం ఇవ్వడం లేదు, గతంలోనే ఇద్దరు మహిళలకు బోర్డ్‌లో స్థానం ఉంది. కేంద్రమంత్రి రిజీజు మాట్లాడుతూ ఆర్మీ, రైల్వేల తరువాతే ఎక్కువ భూమి వక్ఫ్ బోర్డ్ చేతుల్లోనే ఉందని మాట్లాడారు. ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు. దీనికి ఉమ్మీద్ అని పేరు పెట్టారు. వక్ఫ్ బై యూజర్ అంటే అయిదారు వందల సంవత్సరాల కిందట మసీద్, దర్గా, కబ్రస్తాన్ నిర్మించి ఉంటే, దానికి ఇప్పుడు డాక్యుమెంట్లు చూపించాలని అడుగుతున్నారు. లేకపోతే వాటిని మూసేస్తామని చెబుతున్నారు. దానిని తొలగించవద్దని కోరినా పట్టించుకోలేదు. వక్ఫ్ భూములపై అధికారం కలెక్టర్‌లకు ఇస్తామనడం మంచిది కాదు. ప్రభుత్వంలో పనిచేసే అధికారి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల న్యాయం జరగదు. దీనినే చంద్రబాబు చాలా తెలివిగా కలెక్టర్ కు అధికారం వద్దు, ఆయన కంటే పై స్థాయిలో ఉన్న వారికి నిర్ణయాధికారం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ పై స్థాయి అధికారి మాత్రం ప్రభుత్వం మాట వినకుండా తన సొంత నిర్ణయం తీసుకుంటారా? అన్నింటిపైనా అధికారులకే అప్పగిస్తే ఇక న్యాయస్థానాలు ఎందుకు? వక్ఫ్ భూములపై హక్కులు ఉండవు వక్ఫ్ ఆస్తులను ఆరు నెలల లోపు సెంట్రల్ డేటా బేస్‌లో ఎక్కించకపోతే ఆ ఆస్థిపై హక్కు కోల్పోతారని చెబుతున్నారు. వందల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ లోమాత్రం ఇతర మతస్థులను పెట్టి, నామినేటెడ్‌గా పదవులను కేటాయించాలని చూస్తున్నారు. దీనివల్ల ముస్లీంలకు న్యాయం జరుగుతుందా? అన్ని సంస్థలకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేందుకే ఈ చట్ట సవరణ తీసుకువచ్చారు. వక్ఫ్ ఆస్తి అంటే అల్లాపై విశ్వాసంతో ఎవరైనా సరే భగవంతుడికి కొంత మేర ఆస్తి సమర్పిస్తారు. కానీ తాజా సవరణతో ముస్లీంగా కనీసం అయిదేళ్ళు ఉన్న వారే ఇలా దానం చేయడానికి అర్హులనే నిబంధన దారుణం. దేశంలోని అన్ని దర్గాలకు మతాలతో సంబంధం లేకుండా భక్తులు వెడుతుంటారు. వారి అనుకూలతను బట్టి ఆస్తులను భగవంతుడికి సమర్పిస్తుంటారు. దీనిని కూడా మత కోణంలో చూడటం దుర్మార్గం.