షర్మిల.. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?

ఎక్స్ వేదిక‌గా మాజీ మంత్రి ఆర్‌కే రోజా సూటి ప్ర‌శ్న‌

తాడేపల్లి:  వైయ‌స్ వివేకానంద‌రెడ్డి(YS Vivekananda reddy) ని తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా(Ex Minister RK Roja) అన్నారు. ఈ కేసులో నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(chandra babu), కాంగ్రెస్‌ నాయకురాల షర్మిల(Sharmila)పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆమె ఎక్స్ వేదిక‌గా వారి తీరును ఎండ‌గ‌ట్టారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా..
‘షర్మిళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేల రూపాయలకూ అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు – ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తోంది షర్మిల.

వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా, షర్మిళ ? దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ రోజా ఘాటు విమర్శలు చేశారు.    

Back to Top