తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం పై ముస్లిం సమాజం ఆగ్రహంగా ఉందని గ్రహించిన చంద్రబాబు దాని నుంచి దృష్టి మళ్ళించేందుకు తాజాగా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా విప్ జారీ చేయలేదంటూ చంద్రబాబు తన పచ్చమూకతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నిన్నటి అప్పులు, నేటి వక్ఫ్ సవరణ బిల్లు వరకు చంద్రబాబు అబద్దాలకు అంతు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను అని ఎన్నికల సమయంలో ఘంటాపథంగా చెప్పారు. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని ముస్లిం మైనార్టీలు చర్చించుకుంటున్నారు. ముస్లింలు దీనిపై ప్రశ్నిస్తుండటంతో చంద్రబాబు తనకు అలవాటు అయినా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలకు వైయస్ఆర్‌సీపీ విప్ జారీ చేయలేదని, బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిందంటూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలోప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ అనుకూల జర్నలిస్ట్‌లతో ఈ తప్పుడు వార్తలను పెద్ద ఎత్తున వైరల్ చేయిస్తున్నారు. చాలా స్పష్టంగా వైయస్ఆర్‌సీపీ రాజ్యసభలో జారీ చేసిన విప్‌ను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాను. గతంలోనే ఈ బిల్లును వైయస్ఆర్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగ విరుద్దమైన ఈ బిల్లుకు పార్లమెంట్ రెండు సభల్లోనూ వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకంగా ఓటు వేయడం దేశం మొత్తం చేసింది. మైనార్టీలకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దమంటూ పార్టీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడిన మాటలను దేశమంతా టీవీల్లో చూసింది. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం అబద్దాలతో విషం చిమ్మే కార్యక్రమాన్ని తనకు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అబద్దాలతోనే బాబు రాజకీయ జీవితం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నిన్నటి అప్పులకు సంబంధించిన అబద్దాల నుంచి నేటి పీ4 కార్యక్రమం వరకు అన్ని చంద్రబాబు చెప్పిన పచ్చి అబద్దాలే. ఎన్నికలకు ముందు ప్రభుత్వ అప్పులు రూ. 14 లక్షల కోట్లు అంటూ పదేపదే చెప్పాడు. ఇప్పుడు రూ.పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని అన్నారు. ఆధారాలు చూపమంటే ముఖం చాటేస్తున్నారు. మొత్తం రాష్ట్ర అప్పులు రూ.5.62 లక్షల కోట్లు అని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. పీ4కి సంబంధించి సమాజంలో 20 శాతం పేదలను పదిశాతం సంపన్నుల ద్వారా పేదరికం నుంచి బయటకు తీసుకువస్తానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే దానిలో 1.41 కోట్ల కుటుంబాలు తెల్లరేషన్ కార్డు అంటే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు. అంటే 90 శాతం పేదవారే ఉన్నారు. కేవలం 8.60 లక్షల కుటుంబాలు మాత్రమే ఆదాయపన్ను కడుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు దీనికి విరుద్దంగా ఎలా అబద్దాలు చెబుతున్నారు? మొత్తం చంద్రబాబు రాజకీయ జీవితమే అబద్దాలతో నిండిపోయింది. దానికి కొనసాగింపే తాజాగా వక్ఫ్ సవరణ బిల్లుకు వైయస్ఆర్‌సీపీ విప్ జారీ చేయలేదని చెప్పడం.