పరిధి దాటొద్దు..

 పోలీసులను హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం

వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ.. పోలీసులు దాటడానికి వీల్లేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి. రొటీన్‌గా వ్యవహరించవద్దు.  

పౌరుల అరెస్ట్‌ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చునేమో గానీ, పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీల్లేదని హెచ్చరించింది. ‘రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకం. సమాజం.. ముఖ్యంగా వ్యక్తుల రక్షణ, భద్రతపై పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. 

అందువల్ల వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలని, రొటీన్‌గా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. 

ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ పిటిషన్‌
హరియాణాకు చెందిన విజయ్‌ పాల్‌కు తన పొరుగు వారైన మమతా సింగ్‌ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయ్‌ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తనను కొట్టారంటూ విజయ్‌పాల్‌ పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఆయన హైకో­ర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు 2023లో కొట్టేసింది. దీనిపై విజయ్‌పాల్‌ అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనా స్థలంతో పాటు అటు తర్వాత పోలీస్‌స్టేషన్‌లో కూడా పోలీసులు తనపై దాడి చేశారని విజయ్‌పాల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

తన అరెస్ట్‌ గురించి తన సోద­రుడు జిల్లా ఎస్‌పీకి ఈ–మెయిల్‌ పంపారని, దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారన్నారు. తనను కస్టడీలోకి తీసుకున్న రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు హర్యానా డీజీపీ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. దీంతో డీజీపీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్వయంగా హాజరయ్యారు. 

ఆ తర్వాత పలు విచారణల అనంతరం గత వారం ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాలు కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం, విజయ్‌పాల్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తేల్చింది. ఓ వ్యక్తి క్రిమినల్‌ అయినప్పటికీ, అతని విషయంలో కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని చట్టం చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. 

విజయ్‌పాల్‌పై నమోదైన కేసులో కింది కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యాన్ని మూసి వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులను హెచ్చరించింది. తన కింది అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్న రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. 

ఓ వ్యక్తి అరెస్ట్‌ విషయంలో పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(1)(బీ)(2)లో నిర్ధేశించిన చెక్‌లిస్ట్‌ పట్ల తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తమ ముందు ఉంచిన ఈ చెక్‌లిస్ట్‌ను ఓ ఫార్మాలి­టీగానే భావిస్తున్నామంది. ఈ చెక్‌లిస్ట్‌ను అనుమతించే విషయంలో మేజిస్ట్రేట్‌ సైతం మెదడు ఉపయోగించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Back to Top