చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు 

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆగ్ర‌హం

రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు

ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు ద్రోహం

ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు వెన్నుపోటు

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆగ్రహం

సవరణతో వక్ఫ్ భూములకు రక్షణ లేకుండా పోతోంది

ఈ సవరణతో ముస్లింల హక్కుల ఉల్లంఘన

మైనార్టీల ఆందోళనలను పట్టించుకోని చంద్రబాబు

ముస్లీంలను దగా చేసిన టీడీపీ, జనసేన

వైయ‌స్ఆర్‌ జిల్లా క‌డప‌ క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన అంజాద్ బాషా 

కడప: రాజ్యాంగ విరుద్ద వ‌క్ఫ్‌ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా చంద్ర‌బాబు చ‌రిత్ర‌హీనుడిగా మిగిలిపోతార‌ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్‌సభలో టీడీపీ, జనసేల వైఖరితో ముస్లింలను వంచించారని అన్నారు. గురువారం కడప న‌గ‌రంలోని త‌న‌ క్యాంప్ కార్యాలయంలో అంజాద్‌బాషా మీడియాతో మాట్లాడారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి మైనారిటీలపై వారికి ఉన్న వ్య‌తిరేకతను మ‌రోసారి నిరూపించుకున్నాయి. మైనారిటీల‌ను ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోస‌మే ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన నిజస్వరూపం బయటపడింది. 1995లో బీజేపీతో జ‌త‌క‌ట్టిన చంద్ర‌బాబు, 2004లో ఓడిపోయిన త‌ర్వాత `నా జీవితంలో చారిత్రాత్మ‌క త‌ప్పిదం చేశాన‌ని మైనారిటీల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ముస్లిం వ్య‌తిరేక బీజేపీతో భవిష్య‌త్తులో క‌లిసేది లేద‌ని బ‌హిరంగ స‌భ‌లో ప్రకటించారు. కానీ 2014లో అవ‌స‌రం కొద్దీ అదే ముస్లిం వ్య‌తిరేక బీజేపీతో జ‌త‌క‌ట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవ‌కాశం క‌ల్పించ‌లేదు. రాష్ట్ర చ‌రిత్ర‌లో మైనారిటీల‌కు ప్రాతినిథ్యం లేని ప్ర‌భుత్వాన్ని న‌డిపిన చ‌రిత్ర చంద్ర‌బాబుది. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు మైనారిటీల ఓట్ల కోసం ఎన్ఎండీ ఫ‌రూక్‌ను మంత్రిని చేసిన మోస‌గాడు చంద్ర‌బాబు. 2019లో ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కొచ్చిన చంద్ర‌బాబు, మ‌ళ్లీ అధికారం కోసం 2024లో బీజేపీతో జ‌త‌క‌ట్టాడు. ఇప్పుడు ముస్లింల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకి మ‌ద్ద‌తిచ్చి మైనారిటీల‌కు వెన్నుపోటు పొడిచాడు. బిల్లును వ్య‌తిరేకించాల‌ని ఎంద‌రో ముస్లిం మ‌త పెద్దలు చంద్ర‌బాబుని క‌లిసిన‌ప్పుడు వారికి  అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించాడు. ఆఖ‌రుకి ప‌విత్ర రంజాన్ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఇప్తార్ విందులోనూ మైనారిటీల‌కు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌న‌ని, వ‌క్ఫ్ ఆస్తుల‌ను ప‌రిర‌క్షిస్తాన‌ని మోసపూరిత హామీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తుంద‌న్న‌ట్టు నేష‌న‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తీరా చూస్తే ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లికి మైనారిటీల‌ను తీవ్రంగా వంచించారు. టీడీపీ స‌పోర్టుతో న‌డిచే కేంద్ర ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. చంద్ర‌బాబు త‌ల‌చుకుంటే ఈ బిల్లు చ‌ట్టంగా మారే అవ‌కాశ‌మే ఉండేది కాదు. అయినా చంద్ర‌బాబు ముస్లింల మ‌నోభావాల‌ను కాల‌రాసేలా తన ఎంపీల‌తో బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లికారు. 

మైనార్టీల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చ‌లేదు

ఈ బిల్లు మైనార్టీల‌కు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చంద్ర‌బాబు చెప్పాలి. చంద్ర‌బాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిల‌బెట్టుకోలేదు. మౌజ‌న్లు, ఇమామ్‌లకు ఇవ్వాల్సిన 6 నెల‌ల గౌర‌వ వేత‌నాలు పెండింగ్‌లో పెట్టాడు. 50 ఏళ్లు దాటిన మైనారిటీల‌కు పింఛ‌న్లు ఇస్తాన‌ని చెప్పాడు. దుల్హ‌న్ ప‌థ‌కం కింద పెళ్లి కుమార్తెకు రూ. ల‌క్ష సాయం చేస్తాన‌ని చెప్పాడు. మైనారిటీల‌కు రూ. 5ల‌క్ష‌ల రుణాలు ఇప్పిస్తాన‌ని చెప్పాడు. ప‌విత్ర హ‌జ్ యాత్ర‌కు వెళ్లే యాత్రికుల‌కు రూ. ల‌క్ష ఇస్తామ‌ని చెప్పాడు. వీటిలో ఏ ఒక్క హామీని కూడా ఈ ప‌ది నెల‌ల్లో చంద్ర‌బాబు అమ‌లు చేసిన పాపాన పోలేదు. 2024లో హ‌జ్ యాత్ర‌కు వెళ్లిన ఏ ఒక్క‌రికీ రూపాయి కూడా సాయం చేయ‌క‌పోగా విజ‌య‌వాడ గ‌న్న‌వ‌రం ఎంబార్కేష‌న్ సెంట‌ర్ ర‌ద్దు చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు. మ‌సీదుల నిర్వ‌హ‌ణ‌కు నెల‌కు రూ. 5 వేలు ఇస్తాన‌ని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుద‌ల చేయ‌లేదు. 

మైనార్టీలకు పెద్దపీట వేసిన వైయస్‌ఆర్‌సీపీ

రాష్ట్రంలో మైనారిటీల‌కు న్యాయం  చేసిన వారు ఎవ‌రైనా ఉన్నారంటే అది దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఆ తరువాత అదే ఒరవడిని కొనసాగించిన వైయస్ జగన్ మాత్రమే. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీల‌ను రాజ‌కీయంగా ప్రోత్స‌హించింది. న‌లుగుర్ని ఎమ్మెల్యేలుగా మ‌రో న‌లుగురిని ఎమ్మెల్సీలుగా చేసిన ఘ‌న‌త వైయస్ జ‌గ‌న్‌దే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిని మైనారిటీలకు ఇచ్చారు. స‌మైక్య రాష్ట్రంలో కూడా ఏనాడూ మండ‌లిలో న‌లుగురు మైనారిటీల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. జ‌కియా ఖానంను శాస‌న‌మండ‌లిలో డిప్యూటీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. అనేక‌మందికి రాష్ట్ర స్థాయి చైర్మ‌న్ పోస్టులు, డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ఇచ్చి ప్రోత్స‌హించారు. దేశంలో ఏ ముఖ్య‌మంత్రీ చేయ‌ని విధంగా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు ఖ‌ర్చు చేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. జ‌గ‌న్ హ‌యాంలో మైనారిటీలకు జ‌రిగినంత రాజ‌కీయ ల‌బ్ధి దేశ చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ నాయ‌కుల‌కు చిత్త‌శుద్ధి ఉంటే త‌మ ప‌ద‌వుల‌కు, పార్టీకి రాజీనామా చేసి బ‌య‌ట‌కు రావాలి. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చి ముస్లింల గొంతు కోసిన టీడీపీలో కొనసాగితే రాబోయే రోజుల్లో మిమ్మ‌ల్ని ముస్లిం స‌మాజం వెలివేస్తుంది` అని అంజాద్‌బాషా హెచ్చ‌రించారు. 

Back to Top