హైదరాబాద్: కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిటాల కుటుంబ నేర చరిత్ర నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు సునీత అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని ధ్వజమెత్తారు. తమ నేరమయ రాజకీయాల నుంచి ముసుగు కోసం పరిటాల రవి హత్యను తెరమీదికి తేవడం ఆమెకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్య హత్యలో పరిటాల సునీత సోదరులు, వారి కుమారుల ప్రమేయం ఉందని ప్రజలు గుర్తించారు. తాజా లింగమయ్య హత్య విషయంలో కూడా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లే మా తమ్ముళ్లే ఈ హత్య చేశారని, వారిని పోలీసులకు అప్పగించామని ఆమె అంగీకరించారు. ఈ విషయాన్ని గ్రహించిన పరిటాల సునీత ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. సునీత ప్రమేయం, ప్రోత్సాహంతోనే లింగమయ్య హత్య జరిగిందనే వాస్తవం. పరిటాల కుటుంబ నేరప్రవృత్తి గురించి రాష్ట్రం అంతా తెలుసు. పరిటాల రవి దాదాపుగా వందమందిని హతమార్చారనే విషయం ప్రజలకు తెలియదా? పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదిమందిని హత్య చేయించారనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. తాము చేస్తున్న హత్యారాజకీయాల గురించి ప్రజలకు నిజాలు తెలియవనే భ్రమల్లో పరిటాల సునీత ఉన్నారు. నూరు హత్యలు చేసిన పరిటాల రవి ఆ కేసుల నుంచి ఎలా తప్పించుకోగలిగారు? దాని వెనుక ఉన్న మతలబు ఏమిటీ? పరిటాల హత్య వెనుక వైయస్ జగన్ ఉన్నారంటూ ఆరోపిస్తున్న సునీతకు వాస్తవం తెలియదా? వైయస్ జగన్‌పై ఆరోపణలు అవాస్తవమని సీబీఐ ఆనాడే తేల్చింది పరిటాల రవి హత్యపై ఆనాడు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీఎంగా ఉన్న ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిగారు స్వయంగా సీబీఐ విచారణకు ఇచ్చారు. సీబీఐ దర్యాప్తులో వైయస్ జగన్‌కు ఎటువంటి సబంధం లేదని తేల్చింది. ఆ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడింది. ఇవ్వన్నీ వాస్తవాలు. ఇప్పుడు పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యతో వైయస్ జగన్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు చేయడం వెనుక మతలబు ఏమిటో, డైవర్షన్ రాజకీయం ఎలా చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తమ నేరాలకు ఒక ముసుగు కప్పేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోజుల్లో జేసీ దివాకర్‌రెడ్డి తన భర్తను హత్య చేయించారని ఆమె ఆరోపించారు. జేసీ కుటుంబాన్ని తెలుగుదేశంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ రోజు అదే జేసీ కుటుంబంతో మీరు చక్కని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అంటే సునీత ఆరోపణలకు ఎటువంటి అర్థం లేదనేది తేలిపోతుంది. హత్యా రాజకీయాలతో ఎందరినో బలి తీసుకున్నారు పరిటాల రవికి అత్యంత నమ్మకస్తుడైన చమన్ హత్యలో పరిటాల కుటుంబ పాత్ర లేదా? పరిటాల సునీత రాజకీయ చరిత్రలో ప్రజల జీవితాలపై అవినీతి సామ్రాజ్యంను స్థాపించుకుని రూ. వేల కోట్లు సంపాధించారు. 2019లో వారి పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వైయస్ జగన్ గారి ప్రభంజనంను చూసి ఓటమి పాలవుతామనే అంచనాతో కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను పోటీకి నిలబెట్టారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశంకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సొంత కొడుకు శ్రీరామ్‌కు కాకుండా తాను టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేశారు. పరిటాల కుటుంబం డొల్ల చరిత్ర ప్రజలకు తెలుసు. పరిటాల రవి వల్ల మొత్తం అనంతపురం జిల్లాకే ఫ్యాక్షన్ మరకలు అంటుకున్నాయి. మడకశిర మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై బాంబుదాడి చేయించింది, గాదె లింగప్పను చంపించింది, మాజీమంత్రి జీ.నాగిరెడ్డి ఆఫీస్‌పై బాంబుదాడి చేయించింది పరిటాల రవి కాదా? తనకు టిక్కెట్టు ఇప్పించిన సీసీ వెంకటరాములు, సరిపోడు సూర్యనారాయణలను అణచివేసింది వాస్తవం కాదా? పరిటాల కుటుంబం చేసిన దారుణాల వల్ల నష్టపోయినవారు వేల మంది ఉన్నారు. పరిటాల రవిని చంపిన వారితో కూడా రాజీ పడి, వారి సాయంతో రాజకీయంగా సునీత లబ్ధిపొదారు. ఊసరవెల్లిలా రంగులు మార్చి రాజకీయం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడం తాము తలుచుకుంటే తోపుదుర్తి సోదరులు గ్రామాల్లో తిరగలేరని పరిటాల సునీత మాట్లాడుతున్నారు. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. అన్ని గ్రామాల్లోనూ తిరుగుతాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కూటమి ప్రభుత్వ మద్దతుతో వారి దుర్మార్గాలు కొనసాగవచ్చు. కానీ భవిష్యత్తులో మళ్ళీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా వారి అరాచకాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. నమ్మి ఓట్లువేసిన ప్రజలకు మంచి చేయాలనుకోవాలే తప్ప, వారిని బెదిరించి, భయపెట్టాలని అనుకోవడం సరికాదు. వైయస్ జగన్ గాలి కాలిగోటికి కూడా సరిపోరు. ఓట్లు వేసిన ప్రజల ఆస్తులనే కొల్లగొడుతున్నారు. హంద్రీనావా కాలువ కాంట్రాక్టర్‌లను కమీషన్ల కోసం బెదిరించి, పనులు నిలిచిపోయేలా చేశారు. చివరికి టామాటా రైతుల నుంచి కూడా మామూళ్ళు వసూలు చేసిన చరిత్ర వారిది. మేకవన్నె పులిలా వారి నేర చరిత్ర ఎల్లకాలం ముసుగులో ఉండదు. నటనా చాతుర్యంతో ప్రజలను మభ్యపెట్టానని అనుకోవడం వారి అవివేకం. వారి చేతుల్లో హత్యకు గురైన కుటుంబాలే వారికి రాజకీయంగా సమాధి కడతాయి.