గుంటూరు:లోకేష్‌ను భవిష్యత్ సీఎంగా చేసుకునేందుకు బీజేపీ అండకోసం పోలవరం ఎత్తుపై కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర జలశక్తిశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నామని స్పష్టం చేసినా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరంను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం అయిన తరువాత విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అడగటం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ప్రత్యేక హోదాను మంటగలిపిన వ్యక్తి చంద్రబాబు. ఇవ్వాళ అంతకన్నా మరో ప్రమాదకరమైన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సర్వ నాశనం చేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పోలవరంకు రెండు లెవల్స్ ఉన్నాయి. మొదటి లెవల్ 41.15 మీటర్లు కాగా, రెండో లెవల్ 45.72 మీటర్లు. ఈ రెండో లెవల్ వరకు రిజర్వాయర్‌లో నీటిని నిలపగలిగితేనే పూర్తిస్థాయి సామర్థ్యతో ప్రాజెక్ట్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కృష్ణాడెల్టాకు కావాల్సిన 80 టీఎంసీలు, గోదావరి డెల్టా స్థిరీకరణ, విశాఖపట్నంలోని పారిశ్రామిక అవసరాలకు నీటిని, ఉత్తరాంధ్రకు తాగునీటిని అందించాలంటే ఖచ్చితంగా పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాల్సిందే. అప్పుడే రిజర్వాయర్‌లో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. జలశక్తి వార్షిక నివేదికపై స్పందించండి తాజాగా 41.15 మీటర్లకే ప్రాజెక్ట్ ఎత్తును పరిమితం చేస్తూ, దానికి మాత్రమే నిధులు ఇస్తామని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంగీకారం తెలిపారు. దీనికి గానూ రూ.12,157.53 కోట్లు ఇచ్చి ప్రాజెక్ట్ బాధ్యత నుంచి తప్పుకుంటున్నామని జలశక్తి శాఖ పేర్కొంది. ఇది తప్పని రాష్ట్రప్రభుత్వం చెప్పగలదా? తెలుగుదేశంకు వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి దీనిని ఖండిస్తూ కథనం రాయగలవా? ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్లకు ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే దానికి ఇంకా రూ.25వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. దీనిని ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం చేతెలెత్తేస్తే, సీఎం చంద్రబాబు దానికి అంగీకరించారు. పోలవరం పోయినా ఫరవాలేదు, ఆయనకు ఉన్న సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఇది ఇలా ఉంటే కొత్తగా బనకచర్ల, గేమ్‌ఛేంజర్ అంటూ మరో కొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారు. గోదావరిడెల్టా స్థిరీకరణకు కూడా నీరు అందించలేని స్థితికి పోలవరం ప్రాజెక్ట్‌ను తీసుకువస్తున్నారు. దీనిమీద గతంలోనే చాలాసార్లు మా ఆందోళనలను వెల్లడించాం. పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నారంటే, లేదు తరువాత దీనిని మేం పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి రామానాయుడు సమర్థించుకుంటున్నారు. రాష్ట్రం కాదు నిధులు ఇచ్చే కేంద్రంతో ఈ మాట చెప్పించాలని డిమాండ్ చేస్తే వారి నుంచి ఎటువంటి సమాధానం లేదు. చాలా దుర్మార్గమైన విధానాలకు పాల్పడుతున్నారు. ముగ్గురు కేంద్రమంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారు. పోలవరం అనేది స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి కల. ఈ రాష్ట్ర ప్రజల జీవనాడి. కేవలం 115.44 టీఎంసీలకు పరిమితమయ్యే పరిస్థితిని తీసుకువస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిలమ్మదే సింహభాగం చంద్రబాబు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంటారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ విప్ జారీ చేసింది. ముస్లింలకు అండగా ఉంటామనే మా నిర్ణయాన్ని పార్లమెంట్ సాక్షిగా గట్టిగా వినిపించాం. అదే క్రమంలో తెలుగుదేశం ముస్లింలకు అన్యాయం జరిగేలా రాజ్యాంగ విరుద్దంగా చేసిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి మైనార్టీల ఆగ్రహానికి గురయ్యింది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చంద్రబాబు తన రాజకీయ కుతంత్రాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిలమ్మ సింహభాగంను పోషిస్తున్నారు. మొన్న వరదల విషయంలో కూడా చంద్రబాబును కాపాడటానికి షర్మిలమ్మను డైవర్షన్ పాలిటిక్స్ కింద ప్రయోగించారు. చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మ రాజకీయంగా వైయస్ జగన్ గారితో పోటీ పడాల్సిన అవసరం షర్మిలమ్మకు లేదు. వైయస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్, చంద్రబాబులు కలిసి చేసిన దుర్మార్గమైన రాజకీయాల వల్ల వైయస్ జగన్ పదహారు నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. అలాంటి కాంగ్రెస్‌తో షర్మిలమ్మ చేతులు కలిపారు. తొలుత తెలంగాణలో సొంత పార్టీ పెట్టి, తరువాత కాంగ్రెస్‌లో చేరి, అక్కడి నుంచి ఏపీకి వచ్చి వైయస్ జగన్ పై యుద్దం ప్రకటిస్తున్నారు. మీకు ఆస్తుల తగాదా ఉందా? రాజకీయ తగాదా ఉందా? లేదా రాజకీయంగా చంద్రబాబుకు సహాయం చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారా? చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలా మారారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడల్లా షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతున్నారు. లడ్డూ వ్యవహారం సీరియస్ గా ఉన్నప్పుడు షర్మిలమ్మ వచ్చి వేరే అంశాలతో విషయాన్ని డైవర్ట్ చేశారు. ఆస్తి తగాదాలు ఉంటే కోర్ట్‌లో తేల్చుకోవాలి. ఎప్పుడైనా మీకు కంపెనీలో వాటాలు ఉన్నట్లు మీరు చూశారా? వివాహం జరిగి పాతికేళ్ళ కిందట వెళ్లిపోయిన చెల్లెలుకు వాటాలు ఇస్తారా? చంద్రబాబుకు కూడా ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. హెరిటేజ్‌లో వారికి వాటా ఇస్తారా? వైయస్ఆర్ మరణం తరువాత వైయస్ జగన్‌కు చెందిన అన్ని ఆస్తులపైనా కేసులుండి అటాచ్ చేశారు. ఆ కేసులు తేలకుండానే నాకు ఆస్తిలో వాటాలు ఇవ్వాలని ఎలా అడుగుతున్నారు? అన్నకు ఇష్టం అయితే, ప్రేమ ఉంటే వాటా ఇస్తారే తప్ప హక్కుగా మీకు వాటాలు ఎలా ఇస్తారు? ఇప్పటికే కోర్ట్‌కు వెళ్ళారు. అక్కడ తేల్చుకోవాలే తప్ప వ్యక్తిగత కక్షతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పావుగా ఉపయోగపడటం దురదృష్టకరం. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించాలే తప్ప, వైయస్ జగన్ గారిని వేధించడమే లక్ష్యంగా పనిచేయడం సరికాదు. ఎన్నికల సమయంలో వైయస్ జగన్ గారికి దెబ్బ తగిలితే దానిపైన కూడా షర్మిలమ్మ చేసిన వ్యాఖ్యానాలు అందరినీ బాధించాయి. షర్మిలమ్మ నైతికతను ప్రశ్నిస్తున్నాం. వైయస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్‌పార్టీ వ్యవహరించిన తీరు, వైయస్ జగన్‌ను పదహారు మాసాలు జైలుపాలు చేసిన కక్షసాధింపులు చూసి కూడా ఆ పార్టీలో ఎలా చేరారు? ఇదేనా మీ చిత్తశుద్ది?