ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది

 
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

ఆస్పత్రి మార్చమని కోరినా పట్టించుకోలేదు

నిందితుడు పని చేసే ఆస్పత్రిలో వైద్యం వద్దని చెప్పాం  

యువతి తల్లిదండ్రుల అభ్యంతరాలను లెక్కచేయలేదు

సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కనీసం స్పందించలేదు

ప్రభుత్వం తరఫున ఎవరూ పరామర్శించకపోవడం దారుణం

వరుదు కళ్యాణి ధ్వజం

నిందితుడు దీపక్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్త

అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది 

ప్రెస్‌మీట్‌లో వరుదు కళ్యాణి స్పష్టీకరణ

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.

తాడేపల్లి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి, 12 రోజుల తర్వాత దుర్మరణానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్‌ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే అంజలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరికి 12 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శించలేదని మండిప‌డ్డారు. శుక్ర‌వారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

వరదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రభుత్వం ఉదాసీనత:
    ఒక నరరూప రాక్షసుడి వేధింపులకు ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి అసువుల బాసింది. తన ఆత్మహత్యకు కిమ్స్‌ ఏజీఎం దీపక్‌ కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి మరీ ఆత్మహత్యా యత్నం చేసిన అంజలి పన్నెండు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసింది. ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది. 
    అంజలి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ప్రభుత్వ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనపడింది. ఏ ఆస్పత్రిలోనైతే ఆత్మహత్య ప్రయత్నం చేసిందో అదే ఆస్పత్రిలో వైద్యం అందిస్తే ఎలా న్యాయం చేసినట్టు అవుతుందని, పైగా ఇదే ఆస్పత్రిలో నిందితుడు దీపక్‌ ఏజీఎంగా పనిచేస్తున్నాడని అంజలి తల్లిదండ్రుల తరఫున వైయస్సార్సీపీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఆస్పత్రి మార్చాలని కోరినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. నిందితుడు దీపక్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

ఆ మాటలన్నీ ఏమయ్యాయి?:
    గత నెల 23న అంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. 
    ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే అదే వారికి ఆఖరి రోజు అని చంద్రబాబు, ఆడబిడ్డల మీద కన్నెత్తి చూస్తే తాట తీస్తానన్న పవన్‌ కళ్యాణ్,  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని చెప్పిన హోంమంత్రి అనిత.. ఈ ముగ్గురూ అంజలి విషయంలో ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలి. వీళ్లు చేసిన వాగ్ధానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతుంది. పోలవరం సందర్శన కోసం వచ్చిన చంద్రబాబు, పక్కనే అంజలి చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఉన్నా కన్నెత్తి చూడలేదు. 

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు:
    కామెడీ నాటకాలు వేసుకుని వెకిలి నవ్వులు నవ్వడంలో ఉన్న శ్రద్ధ కూటమి నాయకులకు అమ్మాయిల రక్షణ మీద ఉండటం లేదు. పోలీసులను కూడా రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడానికే వినియోగిస్తున్నారు తప్ప, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాదని అంజలి ఆత్మహత్య వంటి పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న తల్లీకూతుర్ల మీద ఉన్మాది దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి మరణించింది. 
    మహిళల మీద ఎన్ని దాడులు, అఘాయిత్యాలు చేసినా మాకేం కాదన్న భరోసాతో ఉన్మాదులు స్వేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలా తయారైందంటే ఇంట్లో ఉన్నా, బడికెళ్లినా, పనికెళ్లినా, నడిచి వెళ్లినా.. మహిళలకు రక్షణ ఉండటం లేదు. వైయస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ పేరు మార్చడం మినహా, మహిళల రక్షణలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.

Back to Top