తాడేపల్లి: `మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్` అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను అభినందిస్తూ..కూటమి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఇవాళ మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కారణం రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదట నుంచి ఆశించాను. మీ అందరూ చూపించిన తెగువకు, స్పూర్తికి మీ అందరికీ హ్యాట్సాఫ్. మొన్న జడ్పీ,ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్ధానాలు కలిపి దాదాపు 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేక ఎన్నికలు వాయిదా వేశారు.మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు జరిపారు. అలా నిర్వహించిన 50 స్ధానాలకు గానూ... 39 చోట్ల వైయస్సార్సీపీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినా సరే... ఈ మాదిరిగా మభ్యపెట్టి, భయపెట్టి, ఆందోళనకు గురిచేసి, ప్రలోభాలు పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్దీ జ్ణానం రెండూ లేవు. ప్రజాస్వామ్యంలో మనకు బలం లేనప్పుడు ఎవరైనా పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి, ఎవరినైనా నేను భయపెడతాను, కొడతాను, చంపుతాను, ప్రలోభపెడతాను అని అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? అన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. ఎక్కడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి.. నేను ఈ మంచి పని చేశాను అని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి, చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేటట్టు ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. మోసాలుగా మిగిలాయి. ఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి... ప్రతి ఇంటికి వాళ్ల కార్యకర్తలు పంపించి పాంప్లెట్లు పంచారు. ప్రతి ఒక్కరికీ చంద్రబాబు బాండ్లు పంపించాడని ప్రలోభపెట్టి.. ఎన్నికల్లో గెలిచారు. గెల్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి దైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రపపడుతున్నారు. అంతే తప్ప ఆ హామీలు నెరవేర్చాలని కాని, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలని కానీ చంద్రబాబు అడుగుల్లో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం, పాలనలో అబద్దాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్ లు గాలికెగిరిపోయి.. మోసాలుగా కనిపిస్తున్నాయి. చివరకు చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మీ జగన్ పాలనలో... వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి నెలా ఏదో ఒక బటన్ నొక్కే పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగువేళ్లు నోట్లోకి పోయేయి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి లేదు. స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లిషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ క్లాసులు తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్ పెట్టి మన పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలూ గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు పంపిణీ ఆగిపోయింది. మరోవైపు వైద్యం పరిస్థితి అలాగే ఉంది. మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3500 కోట్లు బకాయిలు పెట్టాడు. చివరకు ఆరోగ్యశ్రీ కింద నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సులు గురించి చెప్పాల్సిన పనిలేదు. వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారులకు అమ్ముడుపోయి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్ తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు. మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తామని నమ్మబలికాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు. బాబు ఇస్తామన్నది కూడా లేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటలబీమా పూర్తిగా ఎత్తివేశాడు. ఇన్ పుట్ సబ్సిటీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు లేకపోగా.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనిపరిస్థితుల్లో రాష్ట్రం ప్రయాణం చేస్తోంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చల విడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని దారుణమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ లో 48 స్ధానాలు మనం గెలిస్తే వాళ్లు ఒక్కటే గెలిచారు.అక్కడ ఈ మధ్య కాలంలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగితే... మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు అడ్డుకుని, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు.ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. విశాఖపట్నంలో ఉన్న 98 స్ధానాలకు 56 స్ధానాలకు పైగా వైయస్ఆర్‌సీపీ గెలిచింది.ప్రజాస్వామ్యయుతంగా వైయస్సార్సీపీ మేయర్ ఉంటే, అక్కడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లను క్యాంపులోనికి తీసుకున్నాం. వారు క్యాంపులకు పోతే వాళ్ల ఇళ్లకు పోలీసులు వచ్చి.. మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్ కి తీసుకుపోతామని బెదిరిస్తున్నారు. బుద్ధి, జ్ణానం ఉన్నవాళ్లు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా? అనంతరపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్ధానాలు మనవి.వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి...మన తొమ్మిది మంది ఎంపీటీసీలను ఆయనే కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్ లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా మన ఎంపీటీసీలు వినకపోవడంతో మండల కేంద్రంలో వీళ్ళను నిర్భంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా ఆ మండలంలో భయం రావాలట... అందుకోసం లింగమయ్య అనే బీసీలీడర్ ని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నాడు. ఇదా ప్రజాస్వామ్యం. స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి 16ఎంపీటీసీలు మనం గెలిచాం. అక్కడ ఎంపీపీ పోస్టు మనకి రాలేదు.6 మందిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులే అడ్డుకుని... కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించాడు. అక్కడ కోరమ్ లేకపోయినా 6 మందే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చుని ఎంపీపీ స్ధానంలో బలం లేకపోయినా వ్యవహరిస్తున్న తీరు ఇది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే... వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మన 15 మందిని పోలీసులే బందోబస్తు ఇస్తామని తీసుకుని పోయి... టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు.అంటే టీడీపీ వాళ్లు దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్ లోకి వెళితే మన వాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే అప్పుడు ఎన్నిక వాయిదా వేశారు. మరలా రెండో రోజు ఎన్నికలకు పిలిచి... ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇక తుని నియోజకవర్గంలో 30కి 30 మనమే గెల్చాం. వాళ్ల దగ్గర బలం లేదు. అయినా వైస్ చైర్మన్ పోస్టు వాళ్లకే కావాలని అడ్డంకులు సృష్టించి, వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి.. రిజైన్ చేయించేటట్టు చేశారు. ఇక అత్తిలిలో చూస్తే... అలాగే అత్తిలిలో 20 స్ధానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై అయితే.. మన బలం 15, వాళ్లు నలుగురు ఉన్నారు... అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి.వాళ్లకు నెంబర్ లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా... మీరంతా నిలబడ్డారు.నా అక్కచెల్లమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. అలాంటి సంఘటనలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో... ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది. కష్ట సమయంలో ఉన్న కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నాను. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తికి, ఈ నిబద్ధతకు మీ వైయస్ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. ఈ సారి కచ్చితంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. వైయస్ జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫెర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు తోడుగా ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నాను. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటాను. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు. చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్ కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారి ఉంటాడని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని చెబుతూ.. ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఆయన పీ-4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ-4 విధానం అంటే సమాజంలో ఉన్న 20శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడంట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్దం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం 1000 మంది ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్ లో నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. అయినా నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్టు అబద్దాలు మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నాడు. చంద్రబాబుకి తెలిసీ మోసం చేస్తున్నాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అంటే.. రాష్ట్రం అప్పులు రూ.10లక్షల కోట్లు అంటాడు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించాడు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆయన చేసిన అప్పులు అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షలు కోట్లు అని చెబుతున్నాడు. మరో రెండు రోజుల పోతే రూ.12 లక్షల కోట్లు అని రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. కారణం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్దాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్దాలు, మోసాలతో రాష్ట్రంలో ప్రభుత్వం పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మరలా మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను చూసి తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్బాల్లో వైయస్ఆర్‌సీపీకి చెందిన నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు నాకు అండగా నిలబడుతున్నందుకు మీ అందరికీ మరొక్కసారి హ్యాట్సాఫ్ చెబుతున్నాను అంటూ వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.