మద్యం షాపు తొలగించే వరకు మహిళలకు అండగా ఉంటా

మహిళల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మ‌ద్ద‌తు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మండపేట 28వ వార్డులో మద్యం దుకాణం తొల‌గించే వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్ప‌ష్టం చేశారు. మ‌ద్యం షాపు తొల‌గించాల‌ని మంగ‌ళ‌వారం మ‌హిళ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. వారి నిర‌స‌న కార్య‌క్ర‌మానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మ‌ద్ద‌తు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇళ్ల మ‌ధ్య మద్యం దుకాణం వద్ద‌ని మ‌హిళలు మండుటెండలో రిలే దీక్షలు చేస్తుంటే పట్టించుకోరా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. మ‌ద్యం షాపు తొలగించే వరకు మహిళలకు అండగా ఉంటాన‌ని, ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా బ్రాందే షాపు పెట్టనివ్వనని అన్నారు.  కాదని బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే తానే టెంటు వేసి షాపు ముందు బైఠాయిస్తాన‌ని  హెచ్చ‌రించారు. ఇక్కడి షాప్ తో పాటు పట్టణంలో ఇబ్బందిగా ఉన్న మరో రెండు షాపులు కూడా తొలగించాలంటూ మున్సిపాలిటీలో తీర్మానం చేయిస్తామ‌న్నారు. జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ , ఎక్సైజ్ డీసీలకు మ‌ద్యం దుకాణాల‌పై ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు.  పాలకులకు బ్రాందీ షాపుల్లో వాటాలు ఉండబట్టే మహిళల సమస్యను గాలికి వదిలేశార‌న్నారు.  

Back to Top