అమరావతి: స్వచ్ఛ ఇంధనంగా పిలిచే గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను వైయస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపిందని తాజా అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌తో పాటు ఇంధన సామర్థ్యం, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఏపీ.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన ‘ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదిక ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 21,09,655 మెగావాట్లుగా అంచనా. ఇందులో పవన శక్తి నుంచి 55 శాతం, సౌరశక్తి 36 శాతం, పెద్ద జలశక్తి ప్రాజెక్టులు 6 శాతం, చిన్న జలశక్తి ప్రాజెక్టులు 1 శాతం, ఇతర వనరుల నుంచి 2 శాతం వస్తోంది. వీటిలో 20.3 శాతం అత్యధిక వాటాతో రాజస్తాన్ ముందంజలో ఉంది. మహారాష్ట్ర 11.8 శాతం, గుజరాత్ 10.5 శాతం, కర్ణాటక 9.8 శాతం, ఏపీ 7.9 శాతంతో టాప్–5లో నిలిచాయి. అలాగే, ఇటీవల ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎంబర్ సంస్థల 2018–24 నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థవంతంగా విద్యుత్ రంగానికి అనుసంధానిస్తున్న రాష్ట్రంగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏపీ గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించింది. ప్రధానంగా వ్యవసాయానికి 9 గంటలు ఉచిత సౌర విద్యుత్‌ను అందించడం కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వంటి చర్యలు ఆదర్శనీయమని పేర్కొంది. ఏపీని తిరుగులేని ‘శక్తి’గా మార్చిన వైయస్ జగన్.. వైఎస్ జగన్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ–2020, ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రమోషన్ పాలసీ–2022, ఏపీ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రమోషన్ పాలసీ–2023 వంటి వాటిని తీసుకువచ్చింది. దీంతో పునరుత్పాదక ఇంధన పరిరక్షణకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీకి వరుసగా రెండేళ్ల పాటు అవార్డులు దక్కాయి. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో అప్పటి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం 42 అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకుంది. టాప్ 5 ఉత్పాదక రాష్ట్రాలు రాజస్థాన్ 20.3% మహారాష్ట్ర 11.8% గుజరాత్ 10.5% కర్ణాటక 9.8% ఆంధ్రప్రదేశ్ 7.9%