పెన్షన్ల పంపిణీనా?. పబ్లిసిటీ ఈవెంటా?

నిస్సిగ్గుగా చంద్రబాబు పదే పదే అబద్దాలు

మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ఫైర్‌

స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమే చంద్రబాబు లక్ష్యం

అప్పులపై చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయింది

మెగా డీఎస్సీ పేరుతో మరోసారి చంద్రబాబు డ్రామాలు 

ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్రభాకర్‌రావు ఆగ్రహం

తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు

తాడేపల్లి: రాష్ట్రంలో ప్రతినెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు. అప్పులపైనా, మెగా డీఎస్సీపైనా, స్టీల్‌ప్లాంట్‌పైనా చంద్రబాబు చెప్పిన, మాట్లాడిన అబద్ధాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని జూపూడి అన్నారు.

జూపూడి ప్రభాకర్‌రావు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఈవెంట్‌కు.. డీబీటీకి పోలికా!:
    సీఎం చంద్రబాబు ఈనెల పెన్షన్ల కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గంలోని ఒక ఇంట్లో ప్రారంభించారు. నెలనెలా ఏదో ఒక ఊరికి వెళ్ళడం.. పెన్షన్లు పంచుతూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. ఒక కుటుంబానికి ఇల్లు కట్టిస్తారు. ఒకరికి ఆటో కొనిపెడతారు. వాటిని చూపుతూ రాష్ట్రం అంతా అలాగే ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది. తన వల్లే మొత్తం రాష్ట్రంలోనే పేదల జీవితాలు బాగుపడిపోతున్నాయన్నట్లుగా బిల్డప్‌ ఇస్తారు. 
    ఈరోజు చంద్రబాబు దాదాపు గంటన్నర ప్రసంగంలో అన్నీ అబద్ధాలు, తనను తాను పొగుడుకోవడమే. జగన్‌గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో బటన్‌ నొక్కుడు కన్నా, తాను పంపిణీ చేస్తున్న పెన్షన్లు ఎక్కువంటూ చులకన చేశారు. 
    ‘అయ్యా, చంద్రబాబుగారూ, తన 5 ఏళ్ల పాలనలో జగన్‌గారు బటన్‌ నొక్కి అంటే, డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాలకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.72 లక్షల కోట్లు. కానీ, ఆయన ఏనాడూ మీ మాదిరిగా ఇలా పబ్లిసిటీ ఈవెంట్స్‌ నిర్వహించలేదు. ప్రచార ఆర్భాటం అంతకన్నా చేసుకోలేదు. ప్రతి ఇంటికి తెల్లవారుజామునే వెళ్ళి వృద్దులకు పెన్షన్‌ను అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యవస్థనూ నీరుగార్చారు. అయినా మీరు, పెన్షన్ల పంపిణీ ఈవెంట్‌ను, డీబీటీతో ఎలా పోలుస్తున్నారో అర్థం కావడం లేదు’.

పండుటాకులపై చంద్రబాబు పగ:
    ఇప్పుడే కాదు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో వృద్థుల పట్ల ఆయన ఏనాడూ మానవత్వంతో వ్యవహరించలేదు. ఆనాడు చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు నెలకు కేవలం రూ.1000 చొప్పున మాత్రమే పెన్షన్‌ ఇచ్చారు. అప్పుడు పెన్షన్ల కోసం నెలకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు మాత్రమే. ఆ 5 ఏళ్లలో, టీడీపీ పాలనలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం రూ.27,687 కోట్లు మాత్రమే.
    అదే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైయస్ఆర్‌ సామాజిక పెన్షన్లను రూ.3వేలకు పెంచాం. అందుకోసం నెలకు సగటున దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇవన్నీ వాస్తవాలు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెన్షనర్ల కోసం ఏదో చేస్తున్నాను అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే 3 లక్షల పెన్షన్ల తొలగింపు:
    వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో ఇచ్చిన మొత్తం పెన్షన్లు 66,34,742. కూటమి ప్రభుత్వం ఈనెల పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు. అంటే మూడు లక్షల పెన్షన్లను తొలగించారని అర్థమవుతూనే ఉంది. పెన్షన్ల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున, ఏడాదికి  రూ.32,634 కోట్లు చెల్లించాలి. కానీ బడ్జెట్‌లో పింఛన్లకు ఈప్రభుత్వం కేటాయించింది రూ.27,518 కోట్లు మాత్రమే. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5 వేల కోట్లు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. 
    దివ్యాంగ పింఛన్ల పైన కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. ఈ తొమ్మిది నెలల్లోనే 15 వేల పెన్షన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. జీవిత చరమాంకంలో ఉన్న పండుటాకులపై చంద్రబాబుకు ఎందుకు ఇంత పగ ఉందో అర్థం కావడం లేదు.

స్టీల్‌ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటి బాబూ?:
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గాడిలోపెట్టానని చంద్రబాబు చెబుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో 40వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారు. 5వేల మంది సీనియర్‌ ఇంజనీరింగ్‌ అధికారులను బలవంతంగా బదిలీ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి మాట్లాడుతూ కేబినెట్‌ కమిటీ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అఫైర్స్‌ రిపోర్ట్‌ ప్రకారం స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని సిఫార్సు చేసిందని ప్రకటించారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు దీనిని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఒకవైపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహకరణ అని చెబుతుంటే తాను గాడిలో పెట్టానని ఎలా అబద్దాలు చెప్పగలుగుతున్నారు? 

మెగా డీఎస్సీ అంటూ మరోసారి పచ్చి మోసం:
    మెగా డీఎస్సీ పై తొలిసంతకం అంటూ గతంలో నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు మరోసారి కొత్త నాటకం ప్రారంభించారు. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌లో ఇచ్చి, మే నెలలో పరీక్ష, జూన్‌ నెలలో ఫలితాలు విడుదల చేస్తానని ప్రకటించారు. ఏ నమ్మకంతో చంద్రబాబు చెప్పిన మాటలను నిరుద్యోగులు పరిగణలోకి తీసుకోవాలి. తొమ్మిది నెలల కిందట డీఎస్సీపై పెట్టిన తొలి సంతకానికే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇప్పుడు నోటిఫికేషన్‌ అంటూ చంద్రబాబు చెప్పే మాటలు ఆచరణకు సాధ్యమేనా? నిరుద్యోగులను మోసం చేయడానికే, వారిని ఆశపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు.  

హామీలు అమలు చేయలేక అప్పులంటున్నారు:
    ఎన్నికలకు ముందు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు.
    మరి ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్‌ సిక్స్‌ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. 

ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు:
    చంద్రబాబుకు ఒక యువకుడు ఏదో చెప్పుకునేందుకు ముందుకు వస్తే అతడిపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాను చెప్పే అబద్దాలను అందరూ వినాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరిచిపోకూడదు. కూటమి ప్రభుత్వం చెప్పే అబద్దాలను ప్రజలు స్వీకరించడానికి సిద్దంగా లేరు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం ఎమయ్యారు? నిత్యం చంద్రబాబును పొగిడే పవన్‌ ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు అబద్దాలను ప్రశ్నించలేక ముఖం చాటేస్తున్నారా?. అని జూపూడి ప్రభాకర్‌రావు నిలదీశారు.

Back to Top