శ్రీకాకుళం: అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 24వ డివిజన్ పరిధిలో నిర్వహించారు. పథకాల లబ్ధిదారులతో మాట్లాడి, వాటి అమలు తీరు తెన్నులను తెలుసుకున్నారు. అవినీతి రహిత పాలన తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పని తీరు ఏ విధంగా ఉందో కూడా స్థానిక ప్రజానీకంను అడిగి, మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. స్థానిక 24వ డివిజన్, రైతు బజారు పరిధి లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సెక్రటేరియట్ నంబర్ 009 సచివాలయం సందర్శించి ఇక్కడి అధికారులతో, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలిసి పథకాలు అందుతున్న తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలకు వెంటనే పరిష్కారం చూపారు. మ్యుటేషన్-కు సంబంధించి ఒకే ఒక్క అర్జీ వచ్చింది..అది కూడా వెంటనే క్లియర్ చేయాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశును ఆదేశించారు. అనంతరం మీడియాతో రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ఆత్మ గౌరవాన్ని నిలుపుతూ.. "గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల సరళి ఏ విధంగా ఉందో అన్నది లబ్ధిదారులను ప్రశ్నించాను. ప్రాథమికంగా మేం అడుగుతున్న ప్రశ్నలేంటంటే..మేం ఇచ్చినటువంటి కార్డులో పథకాల వారీగా నమోదు అయిన మొత్తం అందిందా లేదా అని అడుగుతున్నాం. ఈ విధంగా వివిధ పథకాల ద్వారా అందినంత మొత్తం కోసం మీరు ఎవ్వరినయినా ఆశ్రయించాల్సి వచ్చిందా? మీరు ఎవ్వరి దగ్గర అయినా ఆత్మగౌరవం తాకట్టు పెట్టాల్సి వస్తుందా.. ? అదేవిధంగా ఎవ్వరికైనా లంచం ఇవ్వాల్సి వచ్చిందా ? అని అడుగుతున్నాం." కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ .. నో డౌట్ ఇన్ ఇట్ "కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ గా ఈ ప్రభుత్వం నడుస్తుందని పదే పదే అనేక సభలలో చెప్పాను. పథకాల అమలుకు సంబంధించి ఎవ్వరైనా అవినీతికి పాల్పడ్డారా అని అనేక సార్లు అడిగినా కూడా విపక్షాల నుంచి స్పందన లేదు. ఎవ్వరైనా సరే ! ఆధారాలతో వస్తే తప్పక ఒప్పుకుంటామని చెప్పినా ఎ వ్వరూ వీటిపై మాట్లాడడం లేదు. లక్షా నలబై వేల కోట్ల రూపాయల పంపిణీ ఇప్పటిదాకా జరిగింది. ఇంత మొత్తం పంపిణీ చేశాక మూడు సంవత్సరాల తరువాత మేం లబ్ధిదారులను కలిసి పలు ప్రశ్నలను అడిగి పథకాలు అందుతున్న సరళిని మరోసారి వివరిస్తూ వెళ్తున్నాం. అదేవిధంగా పథకాల అమలు వెనుక ఉన్న ముఖ్యోద్దేశాన్ని వివరిస్తూ వస్తున్నాం." పథకాల నిర్వహణలో...దేశానికే ఆదర్శం.... "సంక్షేమ పథకాల ఫలితం అన్నది లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదు అని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు. ఈ విధంగా 90 శాతం అర్హులకు చేరడం లేదని ఆవేదన చెందారు. కానీ ఇవాళ అవినీతి లేకుండా పథకాలు అర్హులకు అందుతున్నాయి. పథకాల అమలు విషయమై లబ్ధిదారులకు పూర్తి సంతృప్తి ఉంది. పథకాల అమలులో దేశంలోనే ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది. అవినీతి చీడను వదిలించుకునేందుకు కొంత సమయం పడుతోంది. కానీ ఇంత వరకూ మేం చేపట్టిన పనుల ద్వారా కరప్షన్ ఫ్రీ గొప్పదనాన్ని అందరూ గుర్తిస్తున్నారు. అంగీకరిస్తున్నారు.." అని అన్నారాయన. స్థానికంగా పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలలో భాగంగా నాయుడు సందులో డ్రైనేజీ సమస్య క్లియర్ చేయమని అక్కడి నివసిస్తున్న ప్రజలు అడిగారు. వెంటనే దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి సాయంత్రానికి సమస్య క్లియర్ చేయనున్నామ న్నారు.