ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌
 

కాకినాడ: ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఐదు నెలల్లో ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 80 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిష్కరిస్తున్నారన్నారు. కాకినాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల చెక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో 19,538 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట లభిస్తుందన్నారు. న్యాయం చేయాలని గత ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని, చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగా అనేకమంది బాధితులు చనిపోయారన్నారు. న్యాయం చేయకపోగా.. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన విలువైన ఆస్తులను కాజేయాలని చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికి అగ్రిగోల్డ్‌ సమస్య వచ్చినప్పుడు సాయం చేస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.10 వేల లోపు ఉన్న బాధితులందరికీ చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారు. రూ.20 వేల లోపు ఉన్నవారికి జనవరిలో ఇస్తానని చెప్పారన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13500 అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు.

Read Also: స్టాల్స్‌ పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

Back to Top