తాడేపల్లి: అధికార మదంతో విర్ర వీగుతున్నా కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అరాచకాలు, దుర్మార్గాలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో భాగంగా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కి అలవాటు పడిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. ఈనెల డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు, మందిరాలకు రక్షణ లేకుండా పోయిందని.. న్యాయస్థానాలు, చట్టాలపై ప్రభుత్వానికి గౌరవం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని చెప్పడానికి నిన్న (గురువారం) జరిగిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఘటన తాజా నిదర్శనం. ఆయన అరెస్ట్‌ను, అరెస్ట్ చేసిన విధానాన్ని, ఆయన భార్యను అడ్డుకున్న విధానాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ దుర్మార్గాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించడం పరిపాటిగా మారింది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కోర్టులు ఆక్షేపిస్తున్నా కూడా పట్టించుకోకుండా చట్టాలను కూడా ఉల్లఘించడానికి ఏమాత్రం సంకోచించకపోవడం లేదు. పోలీస్ వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడిన కూటమి ప్రభుత్వం ప్రతినెలా ఏదొక సంచలనం క్రియేట్ చేయడంలో భాగంగా ఈనెలలో వంశీ అరెస్ట్‌పై దృష్టి సారించింది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, సానుభూతిపరులే వారి లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారనే ఆరోపణలతో ఏకంగా 94 మందికిపైగా వంశీ అనుచరుల మీద కేసులు పెట్టి, 40 మందికిపైగా జైళ్లకు పంపినా సరే వారిలో రాక్షసానందం తీరినట్టు లేదు. పోలీస్‌స్టేషన్‌కొచ్చి ప్రెస్‌మీట్ పెట్టి వంశీని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా మాట్లాడిన టీడీపీ నాయకుడు పట్టాభిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? బూతులు తిట్టి ఈ గొడవకు అసలు కారణమైన పట్టాభిని ఎందుకు వదిలేశారు? సీఐ మీద దాడి చేసిన దానికి చర్యలుండవా? లోకేష్ పుట్టిన రోజు నాడు మా పార్టీ కార్యాలయంపై దాడి కొచ్చిన టీడీపీ కార్యకర్తలపై కేసులుండవా? సత్యవర్థన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?: వల్లభనేని వంశీపై సత్యవర్థన్ అట్రాసిటీ కేసు పెట్టారని చెబుతున్న పోలీసులు విశాఖలో అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పినట్లు సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి ఉంటే పోలీసులకు ఎలా దొరికాడు? అతడిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన అసవరం ఏముంటుంది?. దాడి జరిగిన రోజు తాను ఆఫీసులోనే లేనని, తాను అట్రాసిటీ కేసు పెట్టలేదని జడ్జి ముందే అంగీకరించిన తర్వాత ఇంకా కేసులో బలం ఏముంటుంది? వంశీని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు సూచనలతో ఇదంతా పక్కా ప్రణాళికతో పోలీసులు అమలు చేసిన వ్యూహం. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీనియన్ నాయకుడికి చట్టాలను ఉల్లంఘించడం న్యాయమేనా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా సొంత నియోజకవర్గం యర్రగొండపాలెంలో సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గత 9 నెలలుగా 9 సార్లు పోలీస్ స్టేషన్‌కి పిలిపించి వేధిస్తున్నారు. ఒకసారి ఆయన్ను గుండెలు మీద తన్ని పోలీసులు దాడి చేశారు. ప్రైవేట్ కేసులు వేయడానికి ముందుకొస్తుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు: దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు, ఆయన అనుచరులను తీవ్రమైన అసభ్యపదజాలంతో దూషించి పైశాచిక ఆనందం పొందాడు. అంతటితో ఆగకుండా వారిపైనే కేసులు పెట్టించాడు. జనసేన నాయకుడి వేధింపులకు గురై సర్వం కోల్పోయి న్యాయం కావాలని వేడుకున్న మహిళను కూడా వదలకుండా ఆమె పైనే ఉల్టాగా కేసులు బనాయించిన పరిస్థితి. ఆడియో,వీడియో ఆధారాలతో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అడ్డంగా దొరికిపోయినా శిక్షించకుండా స్వేచ్ఛగా వదిలేశారు. కక్ష రాజకీయాలకు తావు లేదంటూనే చంద్రబాబు దగ్గరుండి రాజకీయ కక్షలకు పాల్పడుతున్నాడు. మహిళను వేధించిన వారికి ఇదే చివరి రోజంటూనే వారిని వేధించిన వారిని శిక్షించకుండా సమాజంలో స్వేచ్ఛగా వదిలేస్తున్నారని ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఆక్షేపించారు.