నీతి ఆయోగ్‌ రిపోర్టుతోనూ డైవర్షనేనా?

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ సూటిప్రశ్న

సూపర్‌సిక్స్‌ అడిగితే డైవర్షన్‌ రాజకీయాలా?

ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ ఆక్షేపణ

నచ్చిన లెక్కలతో చంద్రబాబుకి తోచిన అబద్ధాలు 

చంద్రబాబు దిగిపోయిన ఏడాది నాటి లెక్కలు

జగన్‌ హయాంలో కరోనా కాలంతో పోలికా?   

పాలనలో తేలిపోయాక కూడా మాయమాటలు 

నిజాలు దాటవేసి ఇంకా మభ్యపెట్టాలన్న ఆరాటం

ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు

ఆ హామీలపై ఇకనైనా పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌

తాడేపల్లి: ఎనిమిది నెలలైనా హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు, తన అసమర్థతను జగన్‌ మీదకి డైవర్ట్‌ చేసేందుకు నీతి ఆయోగ్‌ రిపోర్టును ఇష్టారీతిగా మార్చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ ఆక్షేపించారు. తన ఐదేళ్ల పాలనను, జగన్‌ ఐదేళ్ల పాలనతో పోల్చకుండా కరోనా ఏడాదితో పోల్చినప్పుడే చంద్రబాబు తన అసమర్థతను బయటపెట్టుకున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయాల్లో తనది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ప్రభుత్వ ప్రాధాన్యతపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలకు గ్యారంటీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. 

చంద్రబాబుకు వాటిపై స్పష్టత లేదు:
    కూటమి ప్రభుత్వ 8 నెలల పాలన చూస్తే ఎంతసేపటికీ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్పించి వారు చేయాల్సిన పనుల మీద వారికే క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది. 40 ఏళ్ల అనుభవం, విజనరీనని చెప్పుకునే చంద్రబాబుకి ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టత లేదు. ఇచ్చిన హామీల అమలుపై బాధ్యత లేదు. ఈ 8 నెలల పాలనతోనే ప్రజలు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అర్థం చేసుకున్నారు. కరోనా లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సాకులు చెప్పకుండా పారదర్శకుండా పథకాలు అమలు చేస్తే.. చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ నిర్వహణకే ఇంతవరకు మోక్షం లభించలేదు. 

అన్నింటికీ డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఎన్నికల హామీల అమలుపై మాట్లాడకుండా నిత్యం డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే రోజులు నెట్టుకొస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు అవసరమయ్యే రూ.1.5 లక్షల కోట్లు ఎలా తెస్తారని అడిగినప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయమని అడిగినప్పుడల్లా జగన్‌ హయాంలో అప్పులు గురించి తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. చివరకు నీతి ఆయోగ్‌ రిపోర్టు గురించి వివరణ ఇస్తూ పథకాల అమలు తన వల్ల కాదని స్వయంగా చంద్రబాబే తేల్చేశారు. 
    2014–19 మధ్య ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనను 2019–24 మధ్య జగన్‌ ఐదేళ్ల పాలనతో పోల్చకుండా తనకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని  ప్రజలకు తప్పుడు సందేశాలను పంపాలని చూసిన ఘనుడు చంద్రబాబు. అందుకు అనుగుణంగా నీతి ఆయోగ్‌ రిపోర్టులో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 2022–23 కరోనా కాలాన్ని చంద్రబాబు దిగిపోయిన 2018–19 ఏడాదితో పోల్చి విశ్లేషణలు చేశాడు. 

చంద్రబాబు చెప్పని నిజాలు:
    సగటు వార్షిక మూలధన వ్యయం చూస్తే 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రూ. 13,860 కోట్లు కాగా, 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ పాలనలో అది రూ.15,612 కోట్లకు పెరిగింది. సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయంపైన కూడా చంద్రబాబు అబద్ధాలే చెప్పారు. వాస్తవాలు చూస్తే చంద్రబాబు కన్నా సామాజిక రంగంపై జగన్‌ హయాంలోనే రెండింతలు ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.2,437 కోట్లు కాగా, 2019–24 మధ్య వైయ‌స్‌ జగన్‌ పాలనలో ఆ సగటు వ్యయం రూ.5,224 కోట్లుగా ఉంది. 
    ఇక అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) పరిశీలిస్తే..     2014–19 మధ్య చంద్రబాబు పాలనలో సీఏజీఆర్‌ 19.54 శాతం నమోదు కాగా, 2019–24 మధ్య వైయ‌స్‌ జగన్‌ పాలనలో అది 15.61 శాతమే. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు, పీఎస్‌యూలకు హామీ లేని రుణాల ప్రకారం చూస్తే.. చంద్రబాబు హయాంలో అందులో సగటు వృద్ధి రేటు 22.63 శాతం కాగా, జగన్‌ హయాంలో అది 13.57 శాతమే కావడం జగన్‌ పాలన సమర్థతకు నిదర్శనం.  
    కేంద్ర ఆర్ధిక సంఘం అనుమతించిన పరిమితితో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లోటు.. బారోయింగ్‌ కెపాసిటీ (సంచిత అదనపు రుణాలు).. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రూ.31,083 కోట్లు ఉండగా, 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ పాలనలో అది కేవలం రూ.2,817 కోట్లు మాత్రమే. 
    ఇంకా జగన్‌ పాలనలో ఎస్డీజీ (సుస్థిర అభివృద్ధి సూచిక) 21 అంశాలపై సర్వే చేసి రిపోర్టు ఇస్తే అన్నింట్లోనూ టాప్‌ 5 రాష్ట్రాల్లో ఏపీ ఉందంటే అది వైయ‌స్ జగన్‌ పాలనా సమర్థతకు నిదర్శనం కాదా? ఎస్డీజీలో 2020–21, 2023–24 సంవత్సరాల్లో జాతీయ సగటు కన్నా ఏపీ సగటు ఎక్కువగా ఉందంటే ఇంతకన్నా గొప్పతనం ఏం కావాలి? ఈ వివరాలన్నీ మేం సృష్టించినవి కాదు. నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. చూసుకోవచ్చు. 

కూటమి పాలనలో అంతా అథోగతి:
    గడిచిన 8 నెలల కాలంలో ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వ అప్పులు రూ.1.19 లక్షల కోట్లు దాటిపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఉద్యోగాలు పీకేయడం తప్పించి ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చిన పాపానపోలేదు. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ హామీలు అమలుకు మాదే గ్యారంటీ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలకు నమ్మబలికారు. సూపర్‌ సిక్స్‌ హామీల గురించి లోకేశ్‌ ఒకడుగు ముందుకేసి హామీలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఏ హామీకి ఎంత ఖర్చవుతుందో స్పష్టమైన లెక్కలున్నాయని కన్నార్పకుండా చెప్పాడు. 
    వీరంతా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాళా తీసింది. కష్టంగా ఉంది. రోడ్‌ మ్యాప్‌ వేస్తున్నాం. 15 శాతం జీడీపీ సాధిస్తే ఇస్తామని కండిషన్లు పెడుతున్నారు. ఫ్రీబస్‌ పథకం ఎప్పుడు అమలు చేస్తారని నారా లోకేష్‌ని ఒక మహిళ ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని దుస్ధితిలోకి వెళ్లిపోయాడు. 
    కూటమి నాయకులు చేస్తున్న మోసపు ప్రకటనలు ప్రజలకు అర్థమయ్యాయని, ఇప్పటికే ప్రశ్నించడం మొదలుపెట్టారని, ఇంకొన్నాళ్లు ఆగితే, వారిని ప్రజలు బయట ఇంకా గట్టిగా నిలదీస్తారని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.
 

Back to Top