బాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలు

రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి బాబు తాకట్టు

వైయ‌స్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడారు

ఎంపీ శ్రీ‌భ‌ర‌త్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు  పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు

ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.

భయపడినంతా అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో మహాధృతంగా సాగిన 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్. ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు గారి మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు.

టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏ మాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలి. వైయ‌స్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు ఎలుగెత్తి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండిలో గాని, NMDC లో గాని విలీనం చేసి, ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు మరియు అయన వైఖరే కారణం అనడంలో సందేహం లేదు.

 వైజాగ్ ఎంపీ శ్రీభరత్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , ప్రాంతీయ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్  పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు. తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరూ పెదవి విప్పడం లేదంటే కేంద్రంతో స్వార్థ ప్రయోజనాలకోసం లాలూచీ పడ్డారని తెలిసిపోతోంది. ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి వారికి బుద్ధి చెప్పాలి

చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడ్తుంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి వైజాగ్ స్టీల్ ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. మనం కళ్లు మూసుకుంటే ఇది వైజాగ్ స్టీల్ తోనే ఆగదు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు, విద్యాసంస్థలు, విద్యుత్కేంద్రాలను, మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని అమ్మకానికి పెడుతాడు  చంద్రబాబు.

టీడీపీ మొదటి నుంచి వైజాగ్ సంపదను వ్యక్తిగతంగా కొల్లగొట్టుకునే బంగారుగని లా భావిస్తోంది. అక్కడి ప్రజల పట్ల ఎటువంటి నిబద్ధత, అనుబంధం ఆ పార్టీకి లేవు. అమరావతి, హైదరాబాద్ లను అభివృద్ధి చేసి తన ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు లక్ష్యం. ఇది ఒక్క వైజాగ్ కు జరిగే నష్టం కాదు. మిగతా అన్ని నగరాలు, పట్టణాలకు ఇదే గతి పడుతుంది. ప్రజలు మేల్కొని తమ చరిత్రను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.

వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడి పడినది. చంద్రబాబుగారి భావజాలం ప్రకారం అయినంతవరకు అమ్ముకుంటూ పోతే చివరకు ఏవీ మిగలవు. అప్పట్లో 32 మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. ఇప్పుడు దొంగచాటుగా అమ్మకానికి పెడితే అమరులు త్యాగాలు వృథాగా పోయినట్టే. కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు పోరాడితే తప్ప వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగై పోతుంది.

Back to Top