100 రోజులవుతున్నా ఇంకా విషం చిమ్మడమేనా?

కూటమి ప్రభుత్వంపై మాజీ బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫైర్‌ 

మూడు నెలలవుతున్నా ప్రభుత్వంపై ఫీల్‌గుడ్‌ లేదు

ప్రభుత్వంపై అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైంది

అన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు

అందుకే ప్రతి దానికీ గత ప్రభుత్వంపైనే నిందలు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టీకరణ

రాష్ట్ర అప్పులపై నాడు అదే పనిగా విష ప్రచారం

వాస్తవాలు మించి అసత్యాలతో దుష్ప్రచారం

ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తని ఎల్లోమీడియా

రోజూ చంద్రబాబును జాకీలతో లేపే యత్నం

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజం

మా ప్రభుత్వంలోనే వేగంగా పోలవరం పనులు

ఇప్పుడు కేంద్రం నిధులు కూడా మా చొరవే

కానీ అదంతా తమ ఘనతే అని ప్రభుత్వ ప్రచారం

వాటన్నింటినీ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం

ప్రెస్‌మీట్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆక్షేపణ

హైదరాబాద్‌: టీడీపీ కూటమి ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. అందుకే వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అదేపనిగా తమపై విషం చిమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. దాదాపు 100 రోజులవుతున్నా, ఈ ప్రభుత్వం కనీసం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదన్న ఆయన, రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా గత మా ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు.

సూపర్‌ సిక్స్‌ ఏమైంది?:
    గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఆర్భాటంగా ప్రకటించి, ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలు ఏమయ్యాయని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఆ హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్న ఆయన, వారవన్నీ గుర్తు చేస్తున్నారని తెలిపారు. తొలి సంతకంతోనే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలవుతాయని ఎదురు చూస్తున్న ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పారు.

అప్పులపై అసత్య ప్రచారం:
    వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర అప్పులను వాస్తవం కంటే చాలా ఎక్కువ చూపుతూ, ఎల్లో మీడియా అదేపనిగా విష ప్రచారం చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్‌ గుర్తు చేశారు. అదే పనిగా కధనాలు రాసి, ప్రజల్లో అపోహలు, భయాందోళన కలిగించే కుట్ర ఎల్లో మీడియా చేసిందని ఆక్షేపించారు. మరింత దిగజారి రాష్ట్రం మరో శ్రీలంక కాబోతున్నదంటూ ప్రభుత్వంపై విషం చిమ్మారన్న ఆయన, ఇప్పుడు అదే ఎల్లో మీడియా.. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తున్న అప్పులను ఎందుకు పట్టించుకోవడం లేదని, కధనాలు ఎందుకు రాయడం లేదని నిలదీశారు. 

ఇప్పుడు ష్‌.. గప్‌చుప్‌:
    అధికారంలోకి రావడంతోనే జూన్‌ 11న రూ.2 వేల కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16 రూ.2 వేల కోట్లు, జూలై 30న రూ.3 వేల కోట్లు, ఆగస్టు 27న రూ.3 వేల కోట్లు, సెప్టెంబరు 3న మరో రూ.4 వేల కోట్ల అప్పు చేశారన్న మాజీ ఆర్థిక మంత్రి, ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, అంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి త్రైమాసికంలో రూ.30 వేల కోట్లు లోటు, 4 నెలల్లో రూ.43 వేల కోట్ల అప్పు అంటూ వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన మీడియాకు చూపారు. 

రోజూ జాకీలతో ఎత్తే యత్నం:
    వాస్తవాలన్నీ ఇలా ఉంటే, ఎల్లో మీడియా మాత్రం రోజూ జాకీలు పెట్టి సీఎం చంద్రబాబును లేపే ప్రయత్నం చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆ మేరకు చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ, వారు రాస్తున్న కథనాలను మీడియాకు చూపిన ఆయన, వాటిని చదివి వినిపించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారన్న బిల్డప్‌ ఇస్తూ, కేవలం ఆయన వల్లనే అది సాధ్యమంటూ కధనాలు ప్రచురిస్తున్నారని చెప్పారు. కేవలం చంద్రబాబు వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న కలరింగ్‌ ఇచ్చే పని మొదలుపెట్టారని గుర్తు చేశారు.

నాడు వేగంగా పోలవరం పనులు:
    తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరిగాయని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధుల కోసం చాలా చొరవ చూపామని, అయితే ఎన్నికల కోడ్‌ వల్ల అప్పుడు అది ఆగిపోయిందని, అవే ఇప్పుడు వచ్చిన రూ.12,500 కోట్ల నిధులని తెలిపారు. అయినా నిస్సిగ్గుగా టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నీ తమ ఖాతాలో వేసుకుంటోందని ఆక్షేపించారు.
    పోలవరం ప్రాజెక్టుపై స్వాతంత్య్రానికి పూర్వం 1941లోనే ఆలోచన చేసినా.. అది కార్యరూపం దాల్చింది నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలోనే అని బుగ్గన రాజేంద్రనాథ్‌ గుర్తు చేశారు. ఆయన హయాంలోనే పోలవరం పనులు మొదలు కావడం వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. 2005లో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి, ఒక్కొక్కటిగా అన్ని అనుమతులు సాధిస్తూ.. 2009లో  ఆయన ఉన్నంత వరకు.. ప్రాజెక్టు పనులు చేశారని చెప్పారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పోలవరం నిర్మాణానికి తామే పూనుకున్నామంటూ దుర్మార్గంగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

టీడీపీ తప్పిదం. ప్రాజక్టుకు శాపం:
    2014–19 మధ్య టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. 2016, సెప్టెంబరు 8 నాటికి ప్రకటించిన స్పెషల్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు.. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ మాత్రమే పరిగణలోకి తీసుకుని, తాగునీటితో పాటు, ఇతర అంశాలను పరగణలోకి తీసుకోకపోవడం వల్లే ఆ ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
    మరోవైపు ప్రాజెక్టుకు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి, 2013 నాటి చట్టాన్ని పరిగణలోకి తీసుకోలేదని గుర్తు చేసిన ఆయన.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.55 వేల కోట్ల నిధులు అవసరం కాగా.. కేవలం రూ.20 వేల కోట్లతోనే పూర్తి చేస్తామని నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించడం అన్యాయం కాదా? అని నిలదీశారు. 
    పోలవరం పనులు మొదలుపెట్టిన 2005లో నాటి మార్కెట్‌ ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.10,151 కోట్లు కాగా, 2010–11 ధరల ప్రకారం ఆ వ్యయం రూ.16,010 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పడిందని తెలిపారు. దాని ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్స్‌ ప్రకారం వైజాగ్‌కు తాగునీటి సరఫరా కోసం అవసరమైన రూ.4 వేల కోట్ల అంశాన్ని పక్కన పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 
    పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే, కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని.. ఈ ప్రక్రియ గత టీడీపీ ప్రభుత్వంలో (2014–19) నెలల తరబడి కొనసాగేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. అదే మా ప్రభుత్వం వచ్చాక, ప్రధానితో మాట్లాడి నేరుగా స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద నిధులు వచ్చేట్లు చేశామని వెల్లడించారు. దీని వల్ల ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరిగాయని చెప్పారు.

మా కృషి వల్లనే ప్రాజెక్టుకు నిధులు:
    ఇంకా తాగు, సాగునీటి సరఫరా.. రెండింటికీ నిధులివ్వాలని జాతీయ ప్రాజెక్టు నిర్మాణ మార్గదర్శకాల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ  వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే.. అప్పట్లో 2021 జూన్, జూలై, అక్టోబరులో రాసిన మూడు లేఖల ఫలితంగానే, కేంద్రం ఇవాళ మరో రూ.7 వేల కోట్లు ఇవ్వబోతుందని మాజీ మంత్రి తెలిపారు. అంతే కాకుండా 2022, జనవరి 4 తర్వాత, స్పెషల్‌ అసిస్టెన్స్‌ క్యాపిటల్‌ కింద నేరుగా కేంద్రం నిధులిచ్చే విధానం మొదలైందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశమని వెల్లడించారు
    అదే విధంగా ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలు వెడల్పు చేసే ప్రక్రియను కూడా పదే, పదే కేంద్రానికి విజ్ఞప్తి చేసి.. కాంపొనెంట్‌ వైజ్‌ నిబంధనలను కూడా తొలగించేలా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. కానీ, వాటిని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోందని దుయ్యబట్టారు.
    మరోవైపు, 41.15 మీటర్ల ఎత్తు పరిధిలోని గ్రామాల్లో భూసేకరణ, పునారావసం పరిధిలోకి అదనంగా వచ్చిన 36 గ్రామాల కోసం 2023, మే నెలలో ప్రతిపాదన పంపామన్న ఆయన, అందులో ఫేజ్‌–1కు రూ.17,144 కోట్లు అవసరం ఉంటుందని అదే ఏడాది జూన్‌ 5న, మరో ప్రతిపాదన పంపామని చెప్పారు. ఇంకా ఆ ఎత్తు వరకు పనులన్నీ పూర్తి చేయడానికి అవసరమైన రూ.30,437 కోట్లకు విస్తృత చర్చల తర్వాత పీపీఏ నుంచి అనుమతులు సాధించామని తెలిపారు. 2023 ధరల ప్రకారం కేంద్ర క్యాబినెట్‌ అనుమతించిన, రూ.30,437 కోట్లు సాధించిన ఘనత ముమ్మూటికీ తమదే అని తేల్చి చెప్పారు.
    పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం నాడు సీఎంగా ఉన్న  వైయస్‌ జగన్, కేంద్రానికి, ప్రధానికి లేఖలు రాశారని, పలుమార్లు వారిని కలిశారన్న మాజీ మంత్రి.. రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి, అంచనాలు సవరించాలని కోరారని తెలిపారు.
ఫలితంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 27న, ప్రాజెక్ట్‌ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ మీటింగ్‌ జరిగిందని చెప్పారు. 
    ఇవన్నీ వాస్తవాలన్న మాజీ మంత్రి బుగ్గన, కూటమి ప్రభుత్వం ఈ మూడు నెలల్లో ప్రజలకు మేలు చేసిన అంశం ఒక్కటున్నా ఉంటే.. ధైర్యంగా చెప్పాలని బుగ్గ‌న‌ సవాల్‌ చేశారు.

Back to Top