రాజమహేంద్రవరం:మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వం తమ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే గత ప్రభుత్వంలో పారదర్శకంగా అమలు చేసిన లిక్కర్ పాలసీపై, స్కామ్ అంటూ కేసులు పెడుతూ కొత్త నాటకాన్ని తెర మీదికి తీసుకువచ్చిందని వైయస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. రాజమహేంద్రవరంలో వేర్వేరుగా వారు మీడియాతో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అమలు చేస్తే, లేని స్కామ్‌ను సృష్టించి తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అడ్డగోలుగా చేసిన అవినీతిపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ–3 నిందితుడిగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని వారు నిలదీశారు. ప్రెస్‌మీట్స్‌లో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్ ఏం మాట్లాడారంటే..: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం మాఫియాను పెంచి పోషిస్తోంది. కూటమి పార్టీలకు చెందిన నేతలే మద్యం దుకాణాలను హస్తగతం చేసుకున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న దుకాణాలను మూసేసి, ప్రయివేటు వారికి కట్టబెట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న లిక్కర్ అక్రమాలను దాచేయడానికి గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. లిక్కర్ విషయంలో చంద్రబాబు చాలా వ్యవస్థీకృతంగా ఈ అవినీతికి పాల్పడుతూ, మరోవైపు తమ విధానాల్లో అవినీతి లేదని, తప్పులన్నీ గత ప్రభుత్వమే చేసిందంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. కూటమి చేతుల్లోనే మద్యం దుకాణాలు: మద్యం దుకాణాలు మొత్తం కూటమి నాయకులకు, వారికి సంబంధించిన మనుషులకే వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ప్రైవేటు దుకాణాల నుంచి 30శాతం కమీషన్లు తీసుకున్నారు. ఇవ్వని వారిపై ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు దాడులు చేయడం రాష్ట్రం అంతా చూసింది. తర్వాత ఈ దుకాణాలన్నింటినీ టీడీపీ నాయకుల ఆధీనంలో ఉన్న మాఫియా చేతిలో తీసుకొచ్చారు. ఏ బ్రాండు అమ్మాలి? ఎంతకు అమ్మాలి? అనే నిర్ణయాలన్నీ లిక్కర్ మాఫియా చేతిలోనే ఉన్నాయి. ప్రతి క్వార్టర్ బాటిల్‌ను దాదాపు రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. ముందస్తు వ్యూహంతో తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీతో చంద్రబాబు ఒక సర్వే చేయించి, ఆ సర్వే ఆధారంగా వారికి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అమ్మేలా చేస్తున్నారు. ఈ బ్రాండ్లకు సంబంధించిన ఆర్డర్లను తమకు నచ్చిన డిస్టలరీలకు ఇస్తున్నారు. క్వాలిటీ దారుణంగా తగ్గించిన మద్యాన్ని రూ.99కి అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వీలైనంత మేర అవినీతి సొమ్మును దండుకోవడానికి అనధికారికంగా 20 నుంచి 30శాతం మేర లిక్కర్ అమ్మాలని టార్గెట్లు పెట్టారు. పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటి నుంచి డబ్బులు వసూలు చేసుకుని భారీ ఆర్జిస్తున్నారు. వీధివీధికీ బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ఆ బెల్టుషాపులకు కూడా వేలంపాటలు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. వేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ, ఆ డబ్బును దోచుకుంటున్న టీడీపీ, కూటమి నాయకుల చేతిలో ఈ లిక్కర్ మాఫియా రాష్ట్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. లిక్కర్ అవినీతి కేసులో చంద్రబాబు ఏ–3: 2014–19 ప్రభుత్వంలో చంద్రబాబు మద్యం కుంభకోణంలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు. దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు ఏ–3 నిందితుడు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరి ఈ కేసు ఏమైంది? దీని గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు?. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి, అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌కు చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసిన మాట వాస్తవం కాదా? 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసిన మాట నిజం కాదా? తద్వారా చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వచ్చిన మాట వాస్తవం కాదా? రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్‌ప్రోకోకి పాల్పడినట్లు సీఐడీ నమోదుచేసిన ఎఫ్‌ఆర్‌పై ఎందుకు విచారణ ముందుకు కదలడం లేదు? టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఐదేళ్ల కాలంలో రూ.5500 కోట్లు కుంభకోణం జరిగింది. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. ఇది చంద్రబాబు చేసిన నేరం కాదా? అనుకూల డిస్టలరీలకే ఆర్డర్లు: చంద్రబాబు హయాంలో అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్‌తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు బయటపడింది. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావడం లేదు?. రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు తీరుపై వైయస్సార్సీపీ హయాంలో సీఐడీ వద్ద కీలక ఆధారాలున్నాయి. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్‌లో చర్చించ లేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపారు. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో:218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. ఇది ఎంత దారుణమైన నేరం? ఈమేరకు బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించారు. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదాన్ని సృష్టించారు. అక్రమాన్ని కప్పి పుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. ఇంతటి దారుణమైన స్కాం మన కళ్ల ముందే జరిగినా, దీనిపై సీడీఐ ఆధారాలు సేకరించినా, ఎఫ్‌ఐఆర్ నమోదు అయినా మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవడం లేదు? ఎవరి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది?: అసలు లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్‌లు చేసింది ఎవరు? మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు వస్తాయా? లేక వేళాపాలా లేకుండా అమ్మితే లంచాలు వస్తాయా? లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా? లేక షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? షాపులకు తోడు పర్మిట్ రూమ్‌లు, వాటితో పాటు బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టుషాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లకు కాకుండా బేసిక్ రేట్లు పెంచి డిస్టలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా? లేక అవే రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4–5 డిస్టలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? లేక అన్ని డిస్టలరీలకు దాదాపుగా సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టలరీలకు సింహభాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?. ఇంతటి భారీ స్కాం మీరు చేయగా, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, బేతాళుడి మాదిరిగా ఒక కథ అల్లి, దాని చుట్టూ పెద్ద ఎత్తున ప్రచారంచేసి, జగన్‌గారి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వలేదు: ౖవైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థ లేకుండా చేయడం జరిగింది. ఇంకా నాడు మా ప్రభుత్వం లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. ఇంత పారదర్శక వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట.. రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరి తెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించిందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్ వివరించారు.