తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రూప్- 2 విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని అభ్యర్ధులు చెబితే... వాటిని పరిష్కరిస్తామని నమ్మించి హామీనిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారి గొంతు కోసిందన్నారు. నిరుద్యోగ యువత జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రకరకాల హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు.. అధికారంలోకి వచ్చన తర్వాత వారిని నట్టేట ముంచేశారన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగులను తొలగించే కార్యక్రమం ఒకపక్క చేపడుతూనే ఇంకోపక్క శాశ్వత ఉద్యోగులను కుదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదినెలల పాలనలో ఒక్క ఉద్యోగమూ కూటమి ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ దుర్మార్గమైన నిర్ణయాలతో 92,250 మంది గ్రూపు 2 అభ్యర్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన చరిత్ర రాష్ట్రంలో చంద్రబాబుకి తప్ప మరే ముఖ్యమంత్రికి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సమావేశమైన... గ్రూపు 2 అభ్యర్దులకు తగిన న్యాయం జరిగే విధంగా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు.