విజయవాడ: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైయస్ఆర్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, ఉద్యోగులనే కాకుండా చివరకు గ్రూప్-2 అభ్యర్థులను కూడా చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేశారని ఆయన ఆక్షేపించారు. గత మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, వారికి న్యాయం చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు వారిని నట్టేట ముంచాడన్నారు. అభ్యర్ధుల విషయంలో లోకేష్, చంద్రబాబు తలోమాట మాడ్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంకోవైపు గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్లు మీద కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంత సమన్వయలోపం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామన్న మంత్రి లోకేష్ ఇప్పుడు గ్రూపు 2 అభ్యర్ధులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై గ్రూపు 2 అభ్యర్ధులకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసారు. ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. మరోవైపు ఆందోళన చేసిన అభ్యర్ధులపైన పోలీసుల లాఠీఛార్జీని తీవ్రంగా ఖండించిన ఆయన... పోలీసులు అదుపులోకి తీసుకున్న అభ్యర్ధులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబునాయుడికి, కూటమి ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఉన్న ఉద్యోగాలను తీసేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదన్నారు. వాలంటీర్లకు జీతం పదివేలు ఇస్తానని ప్రకటించి.... 2.5 లక్షలమంది ఉద్యోగాలను తీసేశారని మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వైయస్ఆర్‌సీపీ హయాంలో కల్పించిన శాశ్వత ఉద్యోగాలకు కోతపెట్టారని ఆక్షేపించారు. మరోవైపు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 18వేలమందిని, ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ ఉద్యోగాలు తొలగించడం దారుణమని వ్యాఖ్యానించారు. గ్రూపు 2 అభ్యర్ధులకు న్యాయం జరిగేవరకు వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.