అమరావతి : కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయనుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అగ్రికల్చర్ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సమీక్షా సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘తొలి సమావేశం బాగా జరిగింది. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్‌కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయని, రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేస్తాం. ఇక నుంచి ప్రతి నెల అగ్రికల్చర్ మిషన్ సమావేశం ఉంటుంది. విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రైతులకు 9 గంటలు పగలు కరెంట్ అందించేలా 60 శాతం ఫీడర్‌ల ఆధునీకరణ, అందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తాం. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉంది. ఇక విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరాం. రైతు సహకార సంఘాల ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. గతంలో నామినేట్ చేసిన వ్యక్తులే కొనసాగుతున్నారు. వాటిని ఇప్పటికే రద్దు చేశారు.’ అని పేర్కొన్నారు.