కాకినాడ జిల్లా: వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నానాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలోనక్కా మాణిక్యం, గడి దివాణం అనే మరో ఇద్దరిపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. కాకినాడ రూరల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నానాజీ చికిత్స పొందుతున్నారు. నిన్న(శుక్రవారం) జరిగిన వైయస్ఆర్‌సీపీ పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండుగా రెండు చోట్ల దారి కాచి పచ్చమూక దాడులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. మండపంలో పోలీస్ పహరా మండలంలోని మండపం గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నేతలపై కూటమి నేతల దాడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. దాడుల కారణంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కూటమి నేతల దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ నేతలకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజక వర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ముద్రగడ గిరి అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ పర్వత రాజుబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు.