మాజీ మంత్రి విడదల రజిని మామ కారుపై దాడి.. హత్యాయత్నం!

కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో తప్పిన ముప్పు  

 
చిలకలూరిపేట: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రా­జ్యాంగం నడుస్తోంది అనేందుకు పల్నా­డు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు అనే విజ్ఞత మరచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడదల రజిని భర్త తండ్రి లక్ష్మీనారాయణపై దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

వివరాల ప్రకారం.. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌  లక్ష్మీనారాయణ కారు పురుషోత్తమపట్నంలోని ఇంటికి వెళుతున్న క్రమంలో వేణుగోపినాథస్వామి ఆలయం సమీపంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయనపై దాడిచేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకు దిగరా అంటూ రాళ్లు, రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వారి నుంచి డ్రైవర్‌ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు.

ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం  వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన విషయంపై ఆమె మీడియాలో టీడీపీ ఆగడాలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు.  

Back to Top