అనితా.. తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా?

చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

విశాఖపట్నం:  హోం మంత్రి అనితా ..తాను క్రిస్టియన్ అని గ‌తంలో చెప్పారు, ఇప్పుడు హిందువున‌ని చెపుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూ విషయంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్‌ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. శ‌నివారం విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

 హోం మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయం మర్చిపోయిన వంగలపూడి అనిత జగన్‌గారిపై దారుణ విమర్శలు చేస్తోందని, అది అత్యంత హేయమని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అనిత గతి తప్పి, జగన్‌గారిపై పిచ్చి వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారన్న ఆమె, అబద్ధాలు ఎల్లకాలం కొనసాగవని, ఎప్పటికైనా పరిహారం తప్పదని స్పష్టం చేశారు.
    చంద్రబాబు తరహాలో హోం మంత్రి కూడా పచ్చి అసత్యాలు చెబుతున్నారని, టీటీడీ లడ్డూపై ఆరోపణల్లో చంద్రబాబే దోషిగా తేలిందని వరుదు కళ్యాణి వెల్లడించారు. ఆధారాలతో సహా దొరికినా అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె, చంద్రబాబుకు దమ్ముంటే విచారణ కోరాలని అన్నారు. మరి దానికి కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
    తిరుమల ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు చేసిన పాపానికి, శ్రీవారు ఆగ్రహించకుండా ఉండడం కోసం, పార్టీ అధ్యక్షుడి నిర్దేశం మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారని వరుదు కళ్యాణి వెల్లడించారు.
    టీటీడీలో కల్తీ నెయ్యి వాడారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలడంతో, దాన్ని డైవర్ట్‌ చేసేందుకు జగన్‌గారి తిరుపతి 
పర్యటనపై చంద్రబాబు నానా రాద్దాంతం చేశారని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తెలిపారు. జగన్‌గారి తిరుపతి పర్యటనను అడ్డుకోలేదని సీఎం, హోం మంత్రి ఒకే మాట చెబుతున్నారన్న ఆమె.. మరి రాయలసీమ వైయస్సార్‌సీపీ నాయకులకు ఇచ్చిన నోటీసుల్లో ఏముందో చూడాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె ఆ నోటీస్‌ను మీడియాకు చూపుతూ, మాజీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనకు అనుమతి లేనందున, పార్టీ నాయకులెవరూ తిరుపతి రావొద్దని.. ఆ నోటీసులో రాసిన విషయాన్ని చదివి వినిపించారు.
    అంతేకాకుండా, తమ పార్టీ నాయకులందరినీ హౌజ్‌ అరెస్టు చేశారని, మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి బిజేపీ శ్రేణులను తరలించినా, తిరుపతిలో ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు మొహరించి, జగన్‌గారిపై దాడికి వ్యూహం పన్నినా, పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలోనే, తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జగన్‌గారు, తన పర్యటన వాయిదా వేసుకున్నారని చెప్పారు. నిజానికి హోం మంత్రికి బాధ్యత ఉంటే, తిరుపతిలో అంత జరుగుతున్నా, ఎందుకు పట్టించుకోలేదని ప్రస్తావించారు.
    ఇలా ఆధారాలతో సహా, తమ దోషిత్వం బయట పడడంతో సీఎం చంద్రబాబు, మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతున్నారని గుర్తు చేసిన ఆమె, హోం మంత్రి మరింత దిగజారి, మాజీ సీఎం జగన్‌గారిపై కనీస విచక్షణ లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిందిస్తున్నారని తెలిపారు. అనిత మాటలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయన్న వరుదు కళ్యాణి, వాటిని తీవ్రంగా ఖండించారు. 
    తాను క్రిస్టియన్‌ను అని, తన బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్‌ ఉంటుందని స్వయంగా చెప్పిన అనిత, ఇప్పుడు మాట మార్చి తాను హిందువును అంటూ దబాయిస్తున్నారని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆక్షేపించారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతి నుంచి కాలినడనక తిరుమల వెళ్లిన అనిత డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్‌గారి కుటుంబంపై పిచ్చిగా మాట్లాడుతూ, అత్యంత చవకబారు ఆరోపణలు చేస్తున్న అనిత, ఎప్పటికైనా అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
    పీసీసీ అ«ధ్యక్షరాలికి సంబంధించి, విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ మాట్లాడడం షర్మిలకు అలవాటుగా మారిందని.. కడుపులో కుళ్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం ఆమెకు మొదట నుంచి అలవాటు అని చెప్పారు. షర్మిల కడుపు మంట ఎప్పటికి చల్లారుతుందో తెలియడం లేదన్న వరుదు కళ్యాణి, వేరొకరి స్క్రిప్ట్‌ చదవడం మినహా, షర్మిలకు సొంత ఆలోచనలు లేవా? అని ప్రశ్నించారు.

Back to Top