చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి

అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి

మా పథకాలేవని ప్రజలు నిలదీస్తున్నారు

ప్రతి నెలా ఏదో ఒక గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు

అదే పనిగా ప్రతి నెలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ 

అందులో భాగమే కాకినాడ పోర్టు దగ్గర హంగామా

అధికారంలో ఉన్నది మనమా? వాళ్లా? 

ఆర్దిక మంత్రి వియ్యంకుడు రైస్‌ ఎక్స్‌పోర్టర్‌

ఆయన సరుకు ఎందుకు తనిఖీ చేయలేదు?

ప్రభుత్వాన్ని నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం  వైయస్‌.జగన్‌

చంద్రబాబు బాదుడే బాదుడు 

ధాన్యానికి మద్ధతు ధర లేదు

కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి

6 నెలల్లో రూ.15వేల కోట్లు బాదుడు

పప్పు బెల్లాల్లా పోర్టులు, మెడికల్‌ కాలేజీల అమ్మకం

అధికార పార్టీ వ్యవస్ధీకృత నేరాలివి

ప్రజలకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ

ప్రజల తరపున వైయ‌స్ఆర్‌సీపీ పోరు బాట

డిసెంబరు 13, డిసెంబరు 27, జనవరి 3న నిరసన కార్యక్రమాలు.

స్పష్టం చేసిన మాజీ సీఎం వైయస్‌.జగన్‌

మేనిఫెస్టో అమలు చేసిన తొలి ప్రభుత్వం మనది

బడ్జెట్‌ తో పాటు సంక్షేమ కేలండర్‌ కూడా ఇచ్చాం

ఏ నెలలో పథకమో చెప్పి మరీ అమలు చేశాం

లంచాలు, వివక్ష లేకుండా పాలన అందించాం

ప్రైవేటు స్కూళ్లకు థీటుగా ప్రభుత్వ బడులు మార్చాం

వైద్య రంగంలో గణనీయ మార్పులు చేశాం

ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం

ఫ్యామీలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ఇంటింటికీ వైద్యం

సాగులో కనీవినీ ఎరుగని మార్పులు

ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర కల్పించాం: వైయస్‌ జగన్‌ వెల్లడి

వైయ‌స్ జగన్‌ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు

చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ అన్నాడు

ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు

ప్రతి ఇంటిలో ఇదే చర్చ నడుస్తోంది

ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మంచి చేశాం

క్యారెక్టర్, క్రెడిబులిటీ మనకు రక్ష

దీనివల్లే మనం మళ్లీ అధికారంలోకి వస్తాం

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం

ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పి కొడదాం

జనవరి నుంచి జిల్లాల పర్యటన

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటన

ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తలతో మమేకం

 సమావేశంలో  వైయస్‌ జగన్‌ ప్రకటన

తాడేపల్లి:  చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయ‌ని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మా పథకాలేవని ప్రజలు నిలదీస్తున్నారు.   ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ‌ ఉమ్మడి ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైయ‌స్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైయ‌స్‌ జగన్‌ పార్టీ నేతలతో మాట్లాడారు. 

కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత:
    ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు దాటింది. ఈ పరిస్థితుల్లో పార్టీని మనం మళ్లీ సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ కలుస్తున్నాం. ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత ఈ స్ధాయిలో ఏ ప్రభుత్వం మీద లేదు. ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద విపరీతమైన స్ధాయిలో వ్యతిరేకత ఉంది. కేవలం చంద్రబాబునాయుడు పాలనలో మాత్రమే ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. 

మేనిఫెస్టో అమలు చేసిన తొలి ప్రభుత్వం:
    2019–24 మధ్య మనం పాలన చేశాం. మన పాలనలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మన ప్రభుత్వం రానంత వరకు మేనిఫెస్టో ప్రాధాన్యత ఏమిటన్నది తెలియదు. అలా అంతకు ముందు పాలకులు వ్యవహరించారు. ప్రతి ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రజలకు మేనిఫోస్టో చూపిస్తారు. అందులో హామీలన్నీ ఊదరగొడతారు. దానిపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తారు. ఎన్నికలై పోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పాలనను మన కంటే ముందు చూశాం.
    తొలిసారిగా ఆ చరిత్రను మార్చిన పాలన వైయస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ గా భావిస్తూ.. ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతి మాటను తూచ తప్పకుండా బడ్జెట్‌ తో పాటు సంక్షేమ క్యాలెండర్‌ కూడా ప్రకటించి, ఏ నెలలో, ఏ పథకం అమలు చేయబోతున్నామో చెప్పాం. ఆ నెల వచ్చేసరికి బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన పాలన మన ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అంత గొప్పగా ప్రజలకు మంచి చేశాం. 
    మనం రానంత వరకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా పథకాలు ఇవ్వడం సాధ్యమేనా? అన్న పరిస్థితి నుంచి ఔను, ఇవన్నీ సాధ్యమే. కచ్చితంగా చేయగలం.. అని రాష్ట్రానికి, దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా చూపింది వైయస్సార్సీపీ పాలన మాత్రమే. 

విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి:
    ఎప్పుడూ చూడని విధంగా స్కూళ్లు మారాయి. పేదవాడు పేదరికం నుంచి బయటకు వచ్చి సమాజంతో పోటీ పడేలా చదువులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే అందాయి. బడులలో ఎప్పుడూ చూడని మార్పులు తెచ్చాం. ప్రభుత్వ బడుల కన్నా ప్రైవేటు బడులు ముందుంటాయి అన్న పరిస్థితి నుంచి ప్రైవేటు బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితిలోకి తెచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం, మూడో తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ పరకు ప్రయాణం, నాడు–నేడుతో సమూల మార్పులు, ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్‌ చేశాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. 
    వైద్య రంగంలో కూడా ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వ వైద్యుడు గ్రామానికే వచ్చి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేశాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించాం. గతంలో ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు ఉంటే వాటిని 3300కు పెంచాం.  దేశమంతా ప్రభుత్వ రంగంలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే, మన వద్ద జీరో వేకెన్సీ పాలసీతో దాన్ని 4 శాతానికి లోపే తీసుకువచ్చాం. డబ్ల్యూహెచ్‌ ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు అందించాం.

సాగులో కనీవినీ ఎరగని మార్పులు:
    వ్యవసాయంలో కనీవినీ ఎరగని మార్పులు తెచ్చాం. గ్రామంలో రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ గ్రామంలో కనిపిస్తుంది. అక్కడే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ రైతులకు సలహాలు, సూచనలు అందించే పరిస్థితి. తొలిసారిగా పారదర్శకతకు పెట్టపీట వేస్తూ ఇ–క్రాపింగ్, దాని ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా  రైతు పంట వేసే సమయానికే పెట్టుబడి సాయం చేశాం. రైతుల వద్ద నుంచి దళారీ వ్యవస్థను తీసివేయడం సాధ్యమేనా అన్న వాళ్లకు.. ఇది సాధ్యమేనని వైయస్సార్సీపీ హయాంలోనే చేసి చూపించాం. 
    ధాన్యం కొనుగోళ్లను ఆర్బీకే స్దాయి నుంచే మొదలుపెట్టి ప్రతి ఒక్క రైతుకూ కనీస మద్దతు ధర అందేటట్టు చేయడంతో పాటు, రైతులకు బోనస్‌గా జీఎల్‌టీ (గన్నీ బ్యాగులు, లేబర్, ట్రాన్స్‌పోర్టు)గా ఎకరాకు రూ.10 వేలు అందించింది కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వమే.

చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేం:
    పరిపాలనను ఇంటి గడప వద్దకే తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా అన్నీ చేయగలిగాం. అంత మంచి చేసినా ఎక్కడో   పొరపాటు జరిగింది.
    ‘జగన్‌ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతానన్నాడు. తీరా ఎన్నికలయ్యాక పలావు పోయింది. బిర్యానీ కూడా పోయిందన్న’.. మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. ఆరోజు చంద్రబాబు అలా ప్రచారం చేసినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి.. .అన్నా నువ్వు ఏం చెప్పనంటున్నావు. చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్న పిల్లలకు దగ్గర నుంచి ఎవరు కనిపించినా వదలడం లేదు. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15వేలు, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అంటున్నాడు.. వాళ్ల అత్తలు, అమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల యువకుడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అంటున్నాడు. అదే ఇంట్లో నుంచి కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని అంటున్నాడు. ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. మనమూ చెప్పాలని అన్నారు. 

ఆ మాదిరిగా చేశాం కాబట్టే..:
    ఇది మన రాష్ట్ర బడ్జెట్‌. మన రాష్ట్ర పరిస్ధితులు ఇవి. కాబట్టి మనం చేయగలిగింది ఇది మాత్రమే. కానీ మనం చెప్పిన దానికన్నా చంద్రబాబు మూడింతలు చెబుతున్నాడు. అవి సాధ్యం కాదు అని చెప్పాను. కానీ, మనం ఎంత చెప్పినా.. ప్రజలు అటువైపు ఆలోచన చేశారు. ప్రజలు బాధ పడకుండా ఉండాలని, వారిలో చిరునవ్వు చూడాలన్న తపన, తాపత్రయంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనమే భరించాం. కోవిడ్‌ లాంటి విపత్తులు వచ్చినా కారణాలు వెదుక్కోకుండా యుద్ధం చేసి మరీ ప్రజలకు మంచి చేశాం. ఆ మాదిరిగా చేశాం కాబట్టే కాస్తా కూస్తో ప్రజలు చంద్రబాబును ఓ పది శాతం మంది అధికంగా నమ్మి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లారు. 

ఆ రెండే మనకు శ్రీరామరక్ష:
    నేను ఒక్కటే చెబుతున్నాను. ఈ క్యారెక్టర్, క్రెడిబులిటీ వల్లనే మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. నా దగ్గరకు వచ్చిన మన పార్టీ నేతలు మీలో అతి మంచితనం, అతి నిజాయితీ అనే సమస్యలు ఉన్నాయని చెబుతారు. కానీ ఆ రెండు గుణాలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. 
    ప్రజలకు అబద్ధాలు చెప్పినప్పుడు అది మోసం అవుతుంది. అది ప్రజల్లో కోపం కింద మారుతుంది. ఆ కోపమే చంద్రబాబు పాలనలో ప్రజల్లో ఇప్పుడు విపరీతంగా కనిపిస్తుంది. ప్రజలు నిలదీసే పరిస్థితుల్లోకి వస్తున్నారు. నా రూ.15 వేలు ఏమయ్యాయని చిన్నపిల్లలు, నా రూ.18 వేలు ఏమయ్యాని వాళ్ల తల్లులు, నా రూ.48 వేలు ఏమయ్యాయని అమ్మమ్మలు, నా రూ.36 వేలు ఏమయ్యాయని యువకులు, నా రూ.20 వేలు ఏమ్యయాని రైతులు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. 

ప్రతి నెలా ఏదో ఒక గోబెల్స్‌ ప్రచారం:
    దీంతో దిక్కు తోచని స్థితిలో వారు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. జూన్‌లో రుషికొండ భవనాలు అని, జూలైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్‌ అని, ఆగస్టులో ముంబై నటి కాదంబరి జెత్వానీ అని, సెప్టెంబరులో ప్రకాశం బ్యారేజీని బోట్లుతో ఢీకొట్టి కూలగొట్టాలన్న కుట్ర చేశామని, అక్టోబరులో నా కుటుంబాన్ని తెచ్చి, నవంబరులో బడ్జెట్‌పై దృష్టి మరలించడానికి రూ.14 లక్షల కోట్లు అప్పు అని డైవర్షన్‌ చేశారు. ఇప్పుడు డిసెంబరులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అంటూ నానా హంగామా చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారు.

కాకినాడ పోర్టులో హంగామా. ఆశ్చర్యకరం!:
    కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ హంగామా చేయడం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాతలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వంలో మనమున్నామా? వాళ్లున్నారా? అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచాయి. అధికారులు, మంత్రులు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, పోలీసులు అంతా వాళ్ల అధికారులే. చెక్‌ పోస్టులు  వాళ్లవే. పోర్టులో కస్టమ్స్‌ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వాళ్లు పోత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వ మనుషులే. ఇవన్నీ దాటుకుని ఏదైనా మెటీరియల్‌ పోర్టులోకి పోగలుగుతుందా?.
    ఆశ్చర్యంగా పవన్‌ కళ్యాణ్‌ వెళ్లి పరిశీలించిన షిప్ పక్కనే మరో షిప్  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడు శ్రీనివాసరావుది. పట్టాభి రైస్‌ ఎక్స్‌ పోర్ట్స్‌ పేరుతో అదే పోర్టు నుంచి ఆయన బియ్యం ఎగుమతి చేస్తున్నారు. అక్కడికి మాత్రం పవన్‌ కళ్యాణ్‌ వెళ్లడు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు చేస్తున్నారని నాకు ఆశ్చర్యం అనిపించింది.

అధికార పార్టీ వ్యవస్థీకృత నేరాలు:
    ‘వైయస్సార్‌సీపీ కార్యకర్తల వ్యవస్థీకృత నేరాలు’ అంటూ ఈనాడులో రాశారు. అసలు వ్యవస్ధీకృత నేరాలు చేస్తున్నది వాళ్లు అయితే, మన మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చూస్తే.. బియ్యం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ దశాబ్దాలుగా నెంబర్‌ వన్‌ గా ఉంది. తెలంగాణా నుంచి కూడా బియ్యం మన దగ్గరకే వస్తాయి. అందులో పట్టాభి ఎక్స్‌ పోర్ట్స్‌ పేరుతో ఎగుమతి చేస్తున్న పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడు శ్రీనివాసరావు ఆంధ్రాలో నెంబర్‌ వన్‌. 
    మన ప్రభుత్వంలో తొలిసారిగా బియ్యం పంపిణీలో డీలర్ల వ్యవస్ధ పక్కన పెట్టి.. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేశాం. ఇందులో బాగంగా ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌) ఏర్పాటు చేసి ఇంటి వద్దకే సార్టెక్స్‌ చేసి వాళ్లు తినగలిగే బియ్యాన్ని ఇచ్చాం. వాళ్లు అమ్ముకునే పరిస్ధితి లేకుండా దానికి పుల్‌స్టాప్‌ పెట్టే కార్యక్రమం వైయస్సార్సీపీ హయాంలో జరిగింది.
    ఈరోజు ప్రభుత్వం పథకం ప్రకారం ఇంటి వద్దకే బియ్యం ఆపేశారు. మనం సార్టెక్స్‌ చేసి స్వర్ణ వంటి మధ్యస్థ సన్నబియ్యం ఇస్తే.. ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు. వీళ్లు ఇవన్నీ చేస్తుంటే.. వీళ్ల తప్పిదాలతో నాసిరకం బియ్యం సరఫరా కావడం వల్ల మరలా ప్రజల దగ్గర నుంచి వివిధ రూపాల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎగుమతి జరుగుతుంది. 

ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తం:
    మన హయాంలో ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర వచ్చేటట్టు చేశాం. రైతు ఏ మిల్లుకు తాను పోవాలన్నది పూర్తిగా పక్కన బెట్టి.. రైతుకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేశాం. ఆర్బీకే దగ్గరే ఎంత ధాన్యం అమ్మావు, ఎంత రేటు వస్తుందనే స్లిప్పులు ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. ఇవాళ రైతుల పంట చేతికొచ్చే సరికి ఇ–క్రాప్‌ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. కొనుగోలు చేసే వారు లేక.. రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరకు వెళితే వాళ్లు కనీస మద్దతు ధర చెల్లించకుండా, రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాలుగా ధాన్యం సేకరణ వ్యవస్థను సర్వనాశనం చేశారు.

చంద్రబాబు బాదుడే బాదుడు: 
    ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతం చేయడంతో పాటు, ప్రజల తరపున పోరాటం చేయడానికి సన్నద్ధం అయ్యాం. చంద్రబాబు చేస్తున్న పాలన చూసి ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వారి తరపున పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లకు మేమున్నామనే భరోసా ఇవ్వగలిగినప్పుడే ప్రజలకు మన మీద నమ్మకం కలుగుతుంది. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నీ నాశనమయ్యాయి. 
    మరోవైపు బాదుడే బాదుడు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ లేవు. వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి. రూ.6 వేల కోట్ల బాదుడుతో మొదటి డోసు ఇది. నవంబరు, డిసెంబరు బిల్లులో ఏ ఇంటికి వెళ్లినా రూ.300 కనీసం తేడా కనిపిస్తోంది. రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల భారం వేస్తున్నారు. 

రోడ్డెక్కితే బాదుడే బాదుడు:
    ఊళ్లలో రోడ్డెక్కితే చాలు డబ్బు కట్టాల్సిందే అట. అది జాతీయ రహదారులపై చూశాం కానీ, గ్రామీణ రోడ్లు బాగు చేయడం కోసం వాటిపై టాక్స్‌ వేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నాడు. ఆయన హయాంలో, మన హయాంలో తేడా చూస్తే.. మన హయాంలో రూ.43 వేల కోట్లు రోడ్లపై ఖర్చు చేస్తే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో అది రూ.27 వేల కోట్ల మాత్రమే. అక్కడ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఇవాళ చంద్రబాబు హయాంలో సంపద సృష్టి అంటే బాదుడే బాదుడు అని అర్ధం. 

పప్పు బెల్లాల్లా బాబు అమ్మకం:
    రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ఒకవైపు మనం కడుతున్న మెడికల్‌ కాలేజీలు, పోర్టులను చంద్రబాబు అమ్ముతానంటున్నాడు. మనం రాకముందు నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉంటే మనం వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు కట్టాం. ఇప్పుడు ఆ పోర్టులన్నీ శనక్కాయలకు, బెల్లాలకు అమ్ముతాడంట.  

సంపద సృష్టి అంటే ఇదీ..:
    పోర్టులు, మెడికల్‌ కాలేజీలు కూడా అలాంటివే. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈ పోర్టుల నిర్మాణం పూర్తైతే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈ పోర్టు కట్టడానికి ఇవాళ రూ.4 వేల కోట్లు అవసరం అయితే పదేళ్ల తర్వాత రూ.10 వేల కోట్లు అవసరం అవుతుంది. ఈ పోర్టులన్నింటినీ చంద్రబాబు తన వాళ్లకు అమ్మే కార్యక్రమం పెట్టాడు. 
    వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లు పూర్తయ్యాయి. నల్లమల సాగర్‌ రిజర్వాయరు కూడా పూర్తయింది. లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగే ప్రధాన కాల్వల నిర్మాణం కూడా పూర్తయింది. కేవలం ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం మాత్రమే చెల్లించాలి. అది కూడా రూ.1200 కోట్లు డబ్బుస్తే నీళ్లు నింపవచ్చు. దాన్ని ఈ ఏడాది చేయాలనుకున్నాం. అలా పూర్తి చేసిన ప్రాజెక్టు ఈ రోజుకూ అలా ఉండిపోయింది. పూర్తైన ప్రాజెక్టుకు కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ డబ్బులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్‌ కాలేజీ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దాన్ని అమ్మడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి వాళ్లని చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది.

 

పోరు బాట దిశగా..:
    అందుకే మనం అంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ఈ నేపధ్యంలో మీలో కూడా ఎవరైనా నాయకత్వ దిశగా ఎదగాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎదగడానికి అవకాశం వస్తుంది. ప్రజలకు మనం దగ్గర కావాలి. ప్రజలకు దగ్గరవుతూ పోరాటంలో వాళ్లకు తోడుగా నిలబడగలిగితేనే మనకు సానుకూలంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకొండి. చంద్రబాబు మనల్ని త్వరగా రోడ్డు మీదకు వచ్చేలా చేశాడు.

మూడు కార్యక్రమాలు:
    ప్రజల తరపున పోరాటంలో బాగంగా మనం మూడు కార్యక్రమాలు చేపట్టాం. ఈ నెలలో డిసెంబరు 13న అన్నదాతలకు అండగా సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. గతంలో మనం రైతుభరోసా రూ.13500 ఇచ్చాం. ఇందులో ఆరు వేలు కేంద్రమే ఇస్తుందని టీడీపీ వాళ్లు అన్నారు. అంటే కేంద్రం ఇస్తున్నది కాకుండా ఏడాదికి మరో రూ.20 వేలు ప్రతి రైతుకూ ఇస్తామన్నట్టుగా భావన కల్పించారు. కాని ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు. నిలదీసే కార్యక్రమం జరగాలి. ధాన్యం కనీస మద్దతు ధరకోసం కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశాడు. వీటన్నింటి మీద ప్రశ్నిస్తూ రైతుల తరపున కలెక్టర్లు వినతి పత్రం ఇస్తాం. 
    అదే మాదిరిగా డిసెంబరు 27న కరెంటు చార్జీల మీద మరో కార్యక్రమం చేస్తున్నాం. కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఇలాగే చంద్రబాబు అన్నాడు. ఎన్నికల ప్రచారంలో నేనున్నా.. నేను తగ్గిస్తా.. అన్నాడు . తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15000 కోట్లు పెంచాడు. దీనిపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం.
    జనవరి 3వ తేదీన రీయింబర్స్‌మెంట్‌ కోసం మరో కార్యక్రమం చేస్తున్నాం. క్వార్టర్‌ అయిపోయిన వెంటనే నాలుగో నెలలో వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల తల్లుల చేతుల్లో విద్యాదీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మనం ఇచ్చే వాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నాలుగు త్రైమాసికాల నుంచి విద్యాదీవెన అందలేదు. అలాగే వసతి దీవెన డబ్బులు కూడా ఇవ్వలేదు. విద్యాదీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేసి పొలం పనులు చేసుకుంటున్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు. ఆ పిల్లల తరపున చంద్రబాబును ప్రశ్నిస్తూ జనవరి 3న చేస్తున్నాం.    ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. 

జనవరి నుంచి జిల్లాల పర్యటన:
    ఇవే కాకుండా పార్టీని మరింత బలోపేతం చేయాలి. దీన్ని వ్యవస్థీకృత విధానం (ఆర్గనైజ్డ్‌ స్ట్రక్చర్‌)లోకి తీసుకురావాలి. ఇందులో భాగంగా పార్టీలో క్రియాశీల మార్పులు తీసుకు వచ్చాం. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు ఉంటాను. బుధ, గురువారాలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటాను. అవసరాన్ని బట్టి శుక్రవారం కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాను. 
    ‘కార్యకర్తలతో జగనన్న. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నా కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు పూర్తి చేయాలి. సంక్రాంతి లోపే అవన్నీ పూర్తి కావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్దాయి వరకు కమిటీలు పూర్తి చేద్దాం. 

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం:
    యుద్ధం గతంలోలా లేదు. మనం చంద్రబాబుతోనే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎల్లోమీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. వీటికి తోడు చెడిపోయిన ఐటీడీపీతో యుద్ధం చేస్తున్నాం. వీరంతా నిత్యం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
    బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.
    ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా ఎక్కౌంట్‌ ఉండాలి. అన్యాయం జరిగితే దాన్ని కచ్చితంగా ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోటో తీసి ప్రశ్నించాలి. ఎందుకు అమ్మఒడి రావడం లేదు? మా విలేజ్‌ క్లినిక్‌ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది?. ఫోటోలు తీసి అప్‌ లోడ్‌ చేయాలి. తద్వారా ప్రజలకు దగ్గర కావాలని వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు.
 

Back to Top