విజయవాడ: ఐదు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. కూటమి నేతలకు ఎలా పాలించాలో తెలియక వైయస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే ఈ ఐదు నెలల్లో జరిగాయన్నారు. కేంద్రంతో పొత్తులో ఉండి కూడా కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయడం లేదు. ప్రతీకారంపై పెట్టిన దృష్టి పథకాల అమలుపై పెట్టడం లేదు. అప్పుల మీద పెట్టిన దృష్టి సంక్షేమంపై పెట్టలేదు. గతంలో అమ్మఒడి పథకంపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి వచ్చాక ప్రతీ బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం తలకిందులైంది. నాడు-నేడు పేరుతో వైయస్ జగన్ చేసిన పాఠశాలల అభివృద్ధిని మీరు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ పోతిన మహేష్ నిలదీశారు. గతంలో డిజిటల్ విద్యపై విద్యార్థులను ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులకు డిజిటల్ విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు?. పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం కూటమి వచ్చాక కుంటుపడింది. పేదలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామంటే దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తుంటే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం దారుణం. కూటమి వచ్చాకే మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.’’ అని పోతిన మహేష్ మండిపడ్డారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాళ్లని కూడా మోసం చేశారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి సమావేశాలు పెట్టరు గానీ మద్యం పాలసీపై మాత్రం మంత్రి వర్గ సమావేశాలు పెడతారు. గతంలో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఊసే లేదు. రైతు భరోసా, పంట రుణాలు, పంట నష్టాలపై ఎందుకు మాట్లాడం లేదు? ఆంధ్రాలో ఐదు నెలల అలజడి పోతిన మహేష్ కౌంటర్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల గురించి ఎందుకు మాట్లాడం లేదు? 30 వేల కోట్లు ఉంటేనే నిర్వాసితులకు న్యాయం చేయగలమని పవన్ మాట్లాడారు. ఆ 30 వేల కోట్లు మీరు ఇస్తారా? కేంద్రం నుంచి తెస్తారా?. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే.. వాళ్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా మార్చడంపై చంద్రబాబు, పవన్ దృష్టి పెడుతున్నారు. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు దాని ఊసే లేదు ..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ ట్విట్టర్‌లోనే వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం రావు. బీసీలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌లు బీసీ రక్షణ చట్టం ఎందుకు చేయడం లేదు?. అమరావతి నిర్మాణానికి అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇప్పటికే రూ.26 వేల కోట్లు అప్పు తెచ్చారు. అమరావతి నిర్మాణానికి అమరావతే నిధులు తెచ్చుకుంటుందన్న చంద్రబాబు ఇపుడు అప్పులెందుకు?. అమరావతి నిధుల కోసమే పశ్చిమ నియోజకవర్గం త్యాగం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే వారాలబ్బాయి లా తయారయ్యాడు.. దీనికి పవన్ కల్యాణ్ జవాబు చెప్పాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఆయన శాఖలను వదిలేసి ఇతర శాఖలలో తలదూర్చుతూ.. సకల శాఖామంత్రిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్‌లు జగన్ భజన మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. జగన్, షర్మిళల విషయమేమి రాష్ట్ర సమస్య కాదు.. వారి మీద దృష్టి తగ్గించి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలి అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు.