విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టులాంటిదని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని అన్నారు. ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హామీలు అమలు చేయకుండా వేధిస్తున్న ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ లోకం తిరస్కరించింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఘోర పరాజయం తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాట మార్చారు. గెలిచిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు మా అభ్యర్థే అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రఘువర్మను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమావేశాలు నిర్వహించారు. తన ఎక్స్ ఖాతాలో నేరుగా రఘువర్మకు టీడీపీ శ్రేణులు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. వీటితో పాటు రఘువర్మను గెలిపించాలని టీడీపీ నాయకుల పేరుతో పత్రికా ప్రకనటలు కూడా వచ్చాయి. జనసేన పార్టీ సైతం తన అధికారిక ఖాతాలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుతూ పిలుపునిచ్చారు. శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ఇచ్చినట్టు కూటమి నాయకులు ఒక్క ఆధారమైనా చూపించగలరా? ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకతకి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉద్యోగుల్లో దాదాపు 35 శాతంగా ఉన్న టీచర్లు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడింది. విద్యాశాఖను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ టీచర్ల సమస్యలు తీర్చడంలో విఫలం కావడంతోనే వారు ప్రభుత్వానికి గట్టిగా షాకిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగులకిచ్చిన ఏ హామీలు అమలు చేయలేదు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదు. ఐఆర్ ఇవ్వలేదు. మూడు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల పింఛన్ విధానంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం రూ. 26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆఖరుకి ఒకటో తేదీ వేతనం ఒక్కనెలకే ఆగిపోయింది. కూటమి పాలనలో ఉత్తరాంధ్రపై వివక్ష కూటమి ప్రభుత్వం కోలువుదీరాక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వివక్ష చూపెడుతున్నారు. అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటాయించి, విశాఖను మాత్రం ఆర్థిక రాజధాని అని పేరు పెట్టి రూపాయి కూడా కేటాయించకుండా వదిలేశారు. రాష్ట్రంలో రుషికొండ బీచ్ కి మా హయాంలో 2020లో బ్లూఫ్లాగ్ హోదా వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహణ సరిగా లేదని దానిని కూడా తొలగించారు. వైయస్ఆర్‌సీపీ హాయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్లింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, నర్సీపట్నం, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. ఇవన్నీ వైయస్ఆర్‌సీపీ హాయంలో జరిగిన అభివృద్ధి పనులు. కానీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఆ ఉత్తరాంధ్రలో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. చేతిలో అధికారం ఉంది కదా అని పొలిటికల్ గవర్నెన్స్ అంటూ రాజకీయ కక్షలతో వేధించాలని చూస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి.