అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ తోక ముడిచారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా వైయస్ఆర్‌సీపీ సభ్యులు ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. వీసీల రాజీనామా లేఖల్లో 'బెదిరించినట్లు' అనే పదం ఎక్కడా లేదని లోకేశ్ వితండవాదం చేశారు. వైయస్ఆర్‌సీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ కూడా రాదని అహంకార దోరణీతో మాట్లాడారు. లోకేష్ వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ తప్పుబడుతూ..ఒకే సారి అంతమంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది...ఎందుకు ఎంక్వైరీ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి అంటూ బొత్స డిమాండు చేశారు. వీసీల రాజీనామా పై విచారణకు మంత్రి నారా లోకేష్ భయపడ్డారు. విచారణకు అంగీకరించేది లేదని భీష్మించడంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు విచారణకు పట్టబట్టారు. ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.