రేపు వైయ‌స్ఆర్‌సీపీ కీలక సమావేశం

పలు అంశాలపై విస్తృత చర్చ. కార్యాచరణ ప్రణాళిక 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం (4వ తేదీ)  ఉదయం 10.30 గంట‌ల‌కు  పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీలక సమావేశం జరగనుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జనరల్‌ సెక్రటరీలు, సెక్రటరీలతో మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సమావేశం అవుతారు. 
    పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులు, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వంపై ఆందోళనల నిర్వహణ.. తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
    సూపర్‌సిక్స్‌ హామీలు ఎగ్గొట్టిన వైనం, ధాన్యం సేకరణ సక్రమంగా లేకపోవడం, సేకరిస్తున్న ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వకపోవడం, అటు మిల్లర్లు ఇటు దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న వైనంపైనా పోరాడే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చే వీలుంది.
    ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీతో పాటు, పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై సమావేశంలో కార్యాచరణ రూపొందించి, ఆ మేరకు  వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారు.

Back to Top