తాడేపల్లి: కాపుల అభివృద్ధి కోసం వైయస్ జగన్ ప్రభుత్వం కృషిచేస్తోందని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వైయస్‌ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కాపు మహిళలకు ఆర్థికసాయం అందజేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 13 నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని, కాపుల పాలిట గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వం వహించిందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను చాలావిధాలుగా వేధించి, కేసులు పెట్టిన నీచ చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలతో దోచుకుందని మండిపడ్డారు. 13న కలిస్తే ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు హోటల్ పార్కు హయత్‌లో రహస్యభేటీ వెనుక ఆంతర్యమేంటీ..? అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు ముగ్గురు కలిసి రహస్య మంతనాలు జరిపారన్నారు. చంద్రబాబు చెబితేనే కలిశామని సుజనా చౌదరి ఎందుకు చెప్పడం లేదన్నారు. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాకే కలిశామని చెబుతున్నారని, 13వ తేదీన కలిస్తే ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హోటల్‌లో ముగ్గురు కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారంటే బరితెగించారని వీరంతా బరితెగించారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ బీజేపీ ముసుగులో అనైతిక పనులు చేస్తున్నారని, వీరిద్దరిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.