అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైయస్ఆర్‌సీపీనే అంటూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు. సుబ్రహ్మణస్వామి ఏమన్నారంటే.. ‘‘ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైయస్ఆర్‌సీపీనే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైయస్ఆర్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే. తిరుపతి లడ్డూ అంశం ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారు.