దిశాదశ లేకుండా గవర్నర్ ప్రసంగం 

గవర్నర్ తో 'గత ప్రభుత్వ విధ్వంసం' వంటి వ్యాఖ్యలు చెప్పించడం దారుణం

ప్రతిపక్ష గుర్తింపుపై పవన్ కళ్యాణ్ అవగాహన లేని మాటలు

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ

పవన్ ప్రతిపక్ష నేతగా ఉంటానంటే మాకేం అభ్యంతరం లేదు

హాజరు కోసమే సభకు రాలేదు

స్పీకర్ పిలిచి అడిగితే ఇదే చెబుతాను

వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు

దీనిపై విచారణ జరిపించాలి

గ్రూప్-2 అభ్యర్ధుల అభ్యంతరాలను పట్టించుకోలేదు

 సీఎంఓ లేఖకే విలువ లేకపోవడం సీఎంకే అవమానం

అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

అమరావతి: గవర్నర్ ప్రసంగంలో దిశాదశ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మంగళవారం శాసనమండలి సమావేశాలను బాయి కాట్ చేసిన తరువాత అసెంబ్లీ బయట ఆయన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తో తన ప్రసంగంలో రాజకీయపరమైన విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. ప్రతిపక్ష గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే....

ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సందర్భంగా సభను బాయ్ కాట్ చేశాం. ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో అసంబద్ద వ్యాఖ్యలను చేయించడం సరికాదు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గురించి కాకుండా 2047 నాటికి అమల చేయబోయే సూపర్ టెన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అంటే ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్ కు నీళ్ళు వేదిలేశారనే వారు చెబుతున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయ అవగాహన లేకనో, ఆవేశంతోనో, లేక  ఏదో చెప్పాలనో ప్రతిపక్ష గుర్తింపుపై మాట్లాడారు. శాసనసభలోని రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు అధికారపక్షంగా ఉన్నాయి. మిగిలింది వైయస్ఆర్ సీపీ కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షనేతగా ఉంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు. మా కంటే ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చాయి. 
మాకు నలబై శాతం వచ్చినా, ఆయనకు ఆరుశాతం ఓటింగ్ ఉన్నా సీట్ల ప్రకారమే ప్రాతినిధ్యం ఉంటుందనే దానిని మేం కూడా అంగీకరిస్తున్నాం. మాకు ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించమంటే మాకేం అభ్యంతరం లేదు. గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైనా కూడా అది లెక్కకు రాదు అంటున్న వాదనలను మేం పట్టించుకోవడం లేదు. హాజరుకోసం మేం సభకు రాలేదు. మా హక్కును గవర్నర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే మేం సభకు వచ్చాం. స్పీకర్ పిలిచి అడిగినా ఇదే విషయం చెబుతాం. మాది రాజకీయ పార్టీ, అన్ని అంశాలపైనా సందర్భం, సమయాన్ని బట్టి తయారుగా ఉంటాం. 

వీసీల మూకుమ్మడి రాజీనామాలపై విచారణ జరగాలి

రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీలందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలి. వీసీలను అధికారబలంతో బెదిరించి రాజీనామాలు చేయించారు. తరువాత వారికి నచ్చిన వారితో భర్తీ చేయడం ఎంత వరకు సమంజసం. దీనిపై సభలోనే మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాం. ఎవరైనా తప్పు చేస్తే, వారిపైన చర్యలు తీసుకోవాలని సూచించాం. ఇటీవల గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. దీనిలో రోస్టర్ విధానం పట్ల అభ్యర్ధులు ఆందోళనలు నిర్వహించారు. దీనిపై విద్యాశాఖా మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. అభ్యర్ధుల ఆందోళనలను పరిశీలిస్తాము, న్యాయం చేస్తానని అన్నారు. ఇదే అంశంపై వైయస్ఆర్ సీపీగా ఇది సున్నితమైన అంశం, దీనిని పరిశీలించి, అందరికీ న్యాయం చేయాలని కోరాం. తరువాత సీఎం కార్యాలయం నుంచి గ్రూప్ 2  పరీక్షను వాయిదా వేయాలని లేఖ రాశారు. తరువాత తమ లేఖను ఏపీపీఎస్సీ ఖాతరు చేయలేదని వారే చెప్పారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి. అభ్యర్ధుల ఆందోళనలను పరిశీలిస్తామని లోకేష్ చెప్పారు, తరువాత సీఎంఓ నుంచి పరీక్షలను వాయిదా వేయాలని లేఖ రాశారు. దీనికే స్పందన లేకపోవడం ముఖ్యమంత్రికి అవమానం కాదా? అని బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు.
 

Back to Top