అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వైయస్ఆర్‌సీపీ సభ్యులు కోరగా, మండలి చైర్మన్ తిరస్కరించారు. కాగా, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు అసెంబ్లీ సమావేశాలకు సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు. దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు ఏపీ ప్రభుత్వం విధించింది. రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం. ప్రభుత్వం వైఖరిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.