కాకినాడ: మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి కురసాల కున్నబాబు ఆక్షేపించారు. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీల శ్రేణులు వ్యవరించిన తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన వెల్లడించారు. పోలీసులు సాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోయే కార్యక్రమం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఇంటిలో ఉన్న వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడంలో పాటు, మున్సిపల్ ఛైర్మన్ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. విధ్వంసాన్ని సృష్టించారని ఆగ్రహించారు. దీనికి పోలీసులు అండగా నిలవడం అత్యంత దురదృష్టకరమని ఫైర్ అయ్యారు. సోమవారం కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. పరిస్థితి మారకపోతే తుని తరలివెళ్తాం: ప్రజాస్వామ్య పరిరక్షకులమని కబుర్లు చెబుతున్న కూటమి నేతలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప ఎన్నిక కోసం ఇంత దారుణంగా తెగబడ్డం చూస్తుంటే రాష్ట్రంలో అసలు రాజ్యాంగం పని చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసుకుని దాన్నే అమలు చేస్తారా? అని నిలదీశారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేపు కచ్చితంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులన్నీ తుని వెళ్లి టీడీపీ దుర్మార్గాలను అడ్డుకోవడం ఖాయమని కన్నబాబు తేల్చి చెప్పారు. జిల్లా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలి: తునిలో ఇంత ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపధ్యంలో స్ధానిక అధికారుల మీద ఎన్నికలు వదిలేయకుండా, జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా తుని వెళ్లి ఎన్నికలను పర్యవేక్షించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు కూడా కౌన్సిలర్లను ఇళ్ల నుంచి తీసుకు రావడంతో పాటు, ఓటింగ్ పూర్తై వారు తిరిగి ఇళ్లకు చేరే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యం అపహాస్యం: ఒక మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం ఇంతగా దిగజారాలా? అని గట్టిగా నిలదీసిన కురసాల కన్నబాబు, డాంబికాలు పలుకుతున్న కూటమి నేతలు ఈ రకమైన చర్యల ద్వారా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గుర్తు చేశారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేత ఇలాంటి వాతావారణాన్ని ప్రోత్సహిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. తునిలో ఇకనైనా మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక శాంతియుతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కన్నబాబు విజ్ఞప్తి చేశారు.