అమరావతి: ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైయస్ఆర్‌సీపీ సమరభేరి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 27న (శుక్రవారం) కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా, ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. పెట్టుబడి సాయం అందక, కనీస మద్దతు ధర దక్కక, బీమా ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలుస్తూ... రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న వైయస్ఆర్‌సీపీ చేపట్టిన రైతు పోరులో కర్షకులు కదం తొక్కారు. రైతుపోరు తరహాలోనే కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో కలిసి కరెంటు చార్జీల పెంపుపై కదనభేరి మోగిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టర్లను వైయస్ఆర్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా గోడలకు అతికించి.. ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఎన్నికల్లో కరెంటు చార్జీలను తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని.. జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధమైన వైనాన్ని ప్రజలకు వివరించాయి. శీతాకాలంలోనూ కరెంటు బిల్లులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక చలికాలంలోనూ కరెంటు కోతలు విధిస్తుండటంతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు చార్జీల బాదుడు, కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తోడుగా నిలిచి తక్షణమే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమైంది. విద్యుత్ శాఖకు సంబంధించిడిస్కంల సీఎండీ, ఎస్‌ఈ, డీఈఈ, ఏఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించి తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. నిరంకుశత్వంపై పోరు రాష్ట్రంలో పాలకులు అరాచకాలను ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదిరించిన వారిని అంతమొందించేందుకు వెనుకాడటం లేదు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఇది మా రెడ్ బుక్ రాజ్యాంగమని చెబుతున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలకు మళ్లీ రాష్ట్రంలో ఊపిరిపోసి, గంజాయి మత్తులో యువతని ముంచేస్తున్నారు. ఆడ బిడ్డలకు.. పసి పిల్లలకు రక్షణ లేకుండా అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసి రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్‌ను సైతం దూరం చేస్తున్నారు. రూ.వేలల్లో బిల్లులు వేస్తూ రాక్షసుల్లా ప్రజల రక్తం తాగుతున్నారు. ఈ నిరంకుశ, దారుణ పాలనలో కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ నిలబడుతోంది. విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485 కోట్ల భారం మోపారు. ఇందులో ఇప్పటికే రూ.6,072 కోట్లు వసూలును ప్రారంభించారు. వచ్చే నెల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతున్నారు. బడుగులపైనా బాదుడే.. గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల వరకూ మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని 200 యూనిట్లకు పెంచింది. తద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 22,31,549 మంది వినియోగదారులు అప్పట్లో అర్హత పొందారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ టీడీపీ హయాంతో పోలిస్తే వైయస్ఆర్‌సీపీ హయాంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం 2018–19లో దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.637 కోట్లు ఖర్చు చేయడమే దీనికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ 200 యూనిట్లను ఎగ్గొడుతోంది. అర్హులకు పథకాన్ని దూరం చేస్తున్నారు. విద్యుత్‌పై చంద్రబాబుది ఎప్పుడూ ఒకే వైఖరి. ఇంధన రంగాన్ని ఆదాయ వనరుగానే చూడటం ఆయన నైజం. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడూ చార్జీల మోత మోగించారు. శ్లాబులు మార్చి, ఏమార్చి ప్రజలపై బిల్లుల భారం వేశారు. ఇదెక్కడి న్యాయమమని అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో బషీర్‌బాగ్‌లో అమాయకులపై కాల్పులకు ఆదేశించి నిరంకుశంగా ప్రవర్తించారు. నిరసనకారులను గుర్రాలతో తొక్కించారు. ఇప్పుడు మళ్లీ అదే దారిలో ప్రజలపై చార్జీల పిడుగు వేస్తున్నారు. అదనపు భారాలు ఇలా.. తాము వినియోగించిన యూనిట్లకు విధించే చార్జీలతో పాటు కూటమి ప్రభుత్వం అదనపు చార్జీలు కలపడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులు అదనంగా వసూలు చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని నవంబర్ నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్‌సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 వేసి వసూలు చేస్తున్నారు. జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకోవాలని డిస్కంలకు ఏపీఈఆర్‌సీ సూచించింది. దీంతో జనవరి నుంచి విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.08 చొప్పున అదనపు భారాలు పడనున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఈ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వారికి అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తోంది. వేసిన అదనపు చార్జీలను ఉపసంహరించాలని, ఇకపై ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించనుంది. కరెంట్ బిల్లుల భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం » ఏలూరు జిల్లా గవరవరంలో ఉరి పోసుకున్న బాధితుడు » బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ తొలగించిన విద్యుత్తు సిబ్బంది » బాధితుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద మోహరించిన కూటమి పార్టీల నేతలు కొయ్యలగూడెం: షాక్ కొడుతున్న విద్యుత్తు బిల్లుల భారంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో చోటు చేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గవరవరం దళితవాడలో నివసిస్తున్న చాపల నాగేశ్వరరావు ఇంటికి విద్యుత్ బిల్లు రూ.2 వేలు వచ్చింది. ఇదివరకు నెలకు రూ.500 వచ్చేది. ఇప్పుడు ఒకేసారి అంత బిల్లు రావడంతో ఆయన కట్టలేకపోయాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటి సర్వీసు తొలగించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగేశ్వరరావు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే గుర్తించి తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బాధితుడు చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రి వద్దకు రాత్రి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆస్పత్రి వద్దే మోహరించిన కూటమి నేతలు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎవరూ బాధితుడితో మాట్లాడకుండా ఆస్పత్రి వద్ద కాపలా కాస్తున్నారు.