దువ్వాడ పోలీసు స్టేష‌న్‌లో అక్రమ నిర్బంధం

ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై ఆగ‌ని వేధింపులు

మందులు ఇవ్వ‌కుండా ఇబ్బంది

ర‌వికిర‌ణ్ స‌తీమ‌ణితో పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

  విశాఖపట్నం :  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  వైయ‌స్ఆర్‌సీపీ  సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను వేధింపుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆయ‌న్ను అరెస్టు చేశారు. తాజాగా ఇవాళ దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని పీఎస్‌కు తరలించారు. స్టేట్‌మెంట్‌ రికార్డు పేరుతో ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

రవికిరణ్‌ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని ఆయన భార్య మీడియా ఎదుట వాపోయారు. ‘‘పదే పదే పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు’’ అని అన్నారామె.

దువ్వాడ పోలీసులు రవికిరణ్‌, ఆయన భార్యతో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీలు చేయాలని చెబుతూ.. ఆమె కారు తాళాలు లాక్కున్నారు. తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ ఆమెను బెదిరించారు. 

ఇద్దరినీ భోజనం కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు.  తన భర్తకు కనీసం మాత్రలు ఇవ్వాలని ఆమె కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇబ్బంది పెడతానంటూ సీఐ మల్లేశ్వరరావు బహిరంగంగానే ఆమెకు వార్నింగ్‌ ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్‌ చేయించారు. అంతేకాదు.. విచారణ పేరుతో పిలిపించుకుని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. 

Back to Top