ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ మాత్రం లేని రక్షణ లేకుండా పోయిందని, వారికి భద్రత కొరవడిందని.. చివరకు చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆక్షేపించారు. కూటమి పాలనలో ఈ 5 నెలల్లో 100 మంది మహిళల ఉసురు పోసుకున్నారన్న ఆయన, ఆడబిడ్డలకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం దేనికని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదన్న ఆయన, ఏ మాత్రం సిగ్గు, మానం, రోషం ఉంటే వెంటనే దిగిపోవాలని డిమాండు చేశారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాన్ని పోలీసు వ్యవస్థపై నెట్టడం సిగ్గుచేటన్న మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా నేరాలు అదుపు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులపై మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల ఎక్కడికక్కడ అత్యాచారాలు. నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు వైఫల్యాన్ని ప్రశ్నించలేక, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రిపై వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే, వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, తాను ఒక మాజీ ఎమ్మెల్యే మాదిరిగా కాకుండా.. ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా మాట్లాడుతున్నానంటూ.. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన అమ్మాయి సురక్షితంగా తిరిగి వస్తారన్న భరోసా ఉందా? ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు వారి విధులను సక్రమంగా చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అత్యాచార కేసుల్లో పట్టుబడ్డ నిందితులను తమ పార్టీ వారనో, తమ కులం వారనో, లేదా డబ్బుల కోసం రాజకీయ నాయకులు పంచాయతీలు చేస్తుంటే పోలీసులు ఎలా పని చేయగలరని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మూడేళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసి చంపేసినప్పుడే, నిందితులకు కఠినంగా శిక్ష వేసి ఉంటే 100 అత్యాచార ఘటనలు జరిగేవి కాదన్న రాచమల్లు, నాలుగు నెలలైనా కనీసం బాలిక మృతదేహాన్ని కూడా వెతికి తెచ్చివ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఎంత సేపటికీ జగన్‌ను తిట్టడం, ఆయన కుటుంబం మీద బురద చల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతోనే ఈ ప్రభుత్వానికి సరిపోయిందని.. ‘ఆడలేక మద్దెలోడు’ అన్నట్లుగా వారి చేతకానితనాన్ని పోలీసుల మీద నెట్టి తప్పించుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి దిశ యాప్‌ను అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. ఇకపై ఆడబిడ్డలపై ఒక్క దుర్ఘటన జరిగినా ప్రొద్దుటూరు వేదికగా భారీ ఉద్యమానికి దిగుతామని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.