‘సూపర్‌ సిక్స్‌’ హామీలకు ఎంత ఖర్చు చేశావ్‌ బాబూ?’ 

మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లా: ఐదు నెలల్లో రూ. 59 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్‌ హామీలకు ఎంత ఖర్చు చేసిందంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ఐదు నెలల పాలనలోనే ప్రజలు తిరస్కరించే స్థితికి వచ్చారని దుయ్యబట్టారు.

‘‘ప్రజలు ఓటు వేశారంటే.. ఆంబోతుకి అచ్చేసి వదిలేసినట్లు కాదు. అధికారం వస్తే ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించడం కాదు. స్థానిక ఎమ్మెల్యే అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే దానికి స్థానిక ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాడేపల్లిగూడెంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకున్నవా? మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల కాలంలో పట్టణంలో నాలుగు హత్యలు జరిగాయి. నేరుగా బెల్టు షాపులు గురించి మీ ఎల్లో మీడియాలొనే రాస్తున్నారు.. మాట్లాడే ముందు సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.

‘‘రోడ్లు, గుంతలు గురించి మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఎన్ని రోడ్లు వేశారు?. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నవాబ్‌పాలెం నుంచి నిడదవోలు, చిలకంపాడు లాకుల నుండి వెంకట్రామన్నగూడెం వరకు రూ. 45 కోట్ల నిధులతో నాలుగు లైన్స్ రోడ్లు వేశాం కనబడట్లేదా?. వైయ‌స్‌ జగన్‌ కుటుంబం గురించి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడగలవా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.

ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నపుడు శారదా గ్రంథాలయం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. అప్పడు నువ్వు డబ్బుల కోసం ఆపిన శారదా గ్రంథాలయం ప్రాంతంలో పెట్టిన వ్యాపారాన్ని నువ్వే ఇప్పుడు ప్రారంభోత్సవం చేశావ్. ప్రభాత థియేటర్ వెనకాల చేసిన సెటిల్‌మెంట్‌లో ఎంత తీసుకున్నావ్? ఎల్ఈడి లైట్లు పేరు మీద ఎంత నొక్కేసావ్‌? అంటూ కొట్టు సత్యనారాయణ నిలదీశారు.

 నా కుమారులు గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తిరుపతి దర్శనాలలో అవినీతి జరగకూడదని వారికి అప్పగించాను. 2018లో దారిలో అమ్మేస్తున్న పీడిఎస్ బియ్యం లారీలు పట్టుకుని పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో పెడితే దాని కాంట్రాక్టు పేరు మార్చుకోలేదా? నిన్న కాక మొన్న మీకు సంబంధించిన వాళ్ల పీడీఎస్ బియ్యం లారీలు పట్టుకుంటే ఎమ్మెల్యే తన కొడుకు ద్వారా సెటిల్‌మెంట్‌ చేయించారు. కంగారు పడకు ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఒక సలహా ఇస్తున్నా గోతులు పూడిపించాను అని చెప్పడం మానేసి రోడ్ల నిర్మాణానికి ఎంత శాంక్షన్ చేశారో చెప్పాల‌ని కొట్ట సత్యనారాయణ అన్నారు. 

Back to Top