తాడేపల్లి: ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనలతో వేడుకులను ప్రారంభించిన పార్టీ నేతలు.. ఉత్సాహంగా కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలో గుంటూరు రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైయస్ జగన్ పుట్టిన రోజున స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన అభిమానులను ఆయన అభినందించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సంబరాలతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. ప్రపంచంలో వైయస్ జగన్ గారిని అభిమానించే తెలుగువారికి నేడు పండగ రోజు. రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, గొప్ప విజనరీ వైయస్ జగన్ జన్మదినం మన అందరికీ నిజమైన పర్వదినం. ప్రతి ఇంటిలోనూ కుటుంబసభ్యుడుగా ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న ప్రజానాయకుడు వైయస్ జగన్. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, ఆత్మస్థైర్యం వైయస్ జగన్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్. పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు.