బడి పిల్లలకు పురుగుల అన్నం పెడతారా?

కూటమి ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఫైర్‌

పురుగుల అన్నం తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు

సగం మంది విద్యార్థులకు ఇంటి నుంచి క్యారేజీ   

పేరు మార్చడంలో ఉన్న శ్రద్ధ భోజన నాణ్యతలో లేదు

9 నెలల కూటమి పాలనలో గోరుముద్ద పథకం నిర్వీర్యం

నిర్వహణను పట్టించుకోని విద్యా మంత్రి నారా లోకేష్‌

ప్రెస్‌మీట్‌లో ఎ.రవిచంద్ర ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో విద్యా రంగం నానాటికీ భ్రష్టుపట్టి పోతోందని, ముఖ్యంగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను నీరు గార్చిన ప్రభుత్వం, పిల్లలకు పురుగుల అన్నం పెడుతోందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడి పోతున్నారని, సగం మంది పిల్లలు అనివార్యంగా ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుంటున్నారని ఆయన వెల్లడించారు. గోరుముద్ద పథకం పేరు మార్చి, డొక్కా సీతమ్మ పేరు పెట్టిన ప్రభుత్వం, నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. షాడో సీఎంగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో కలగజేసుకునే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌.. తాను నిర్వహించే విద్యాశాఖను పూర్తిగా గాలికొదిలేశారని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ర‌విచంద్ర‌ మీడియాతో మాట్లాడారు.
    
రవిచంద్ర ఇంకా ఏమ‌న్నారంటే..
– కూటమి ప్రభుత్వం వచ్చాక బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో పిల్లలు ఇంటి వద్ద నుంచే క్యారేజీలు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
– డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సలహాతో గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన కూటమి ప్రభుత్వం చేతులు దులిపేసుకుని, నాణ్యతను పూర్తిగా వదిలేసింది. పేరు మార్చడంలో ఉన్న శ్రద్ద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడంలో చూపించడం లేదు.
– కూటమి ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీలు మార్చేసి ఏకంగా 40 వేల మంది సహాయకులను తొలగించేసింది. 
– ఉడికీ ఉడకని అన్నం, పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతుండటంతో విద్యార్థులు తినలేక బయటపడేస్తున్నారు. ఆ అన్నం తిన్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు.  
– మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ కోసం కేంద్రం 60 శాతం వాటా భరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. 
– షాడో సీఎంగా వ్యవహరిస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందో లేదో తెలుసుకునే తీరిక కూడా ఉండటం లేదు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల చదువులను నిర్లక్ష్యం చేసిన లోకేష్‌కి చిన్నారుల ఆరోగ్యంపై కూడా చిత్తశుద్ధి లేదని చెప్పకనే చెప్పారు. విద్యాశాఖను నిర్వహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు.
– వైయ‌స్ జగన్‌ పాలనలో 16 రకాల పదార్థాలతో రోజుకో మెనూతో బడి పిల్లలకు గోరుముద్ద కింద పౌష్టికాహారం అందించడం జరిగింది. 
– అంతే కాకుండా పథకం పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణకు పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 
– నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 93 శాతం విద్యార్థులు బడిలోనే మధ్యాహ్న భోజనం చేసేవారు. కానీ నేడు కూటమి పాలనలో నాణ్యత లోపించడంతో సగం మంది కూడా బడుల్లో భోజనం తినలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 
– గోరుముద్ద పథకానికి గత జగన్‌ ప్రభుత్వం ఏడాదికి రూ.1400 కోట్లు చొప్పున ఐదేళ్లలో ఏకంగా రూ.7,244 కోట్లు ఖర్చు చేయగా, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం అందు కోసం ఏటా చేసిన వ్యయం రూ.450 కోట్లు మాత్రమే అని ఎ.రవిచంద్ర గుర్తు చేశారు.

Back to Top