సీఎం వైయ‌స్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం

  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసిన ఏకైక సీఎం వైయ‌స్ జగన్‌

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీదే

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

నెల్లూరు : సామాజిక న్యాయం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరులో గురువారం అయన పర్యటించారు. రెండుచోట్లా మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నాయకులు సిద్ధరామయ్య, స్టాలిన్, నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న­ప్పటికీ బీసీలకు న్యాయం చేయలే­కపో­యా­రని, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కృష్ణయ్య చెప్పారు. బీసీలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాదిరిగా ధైర్యం చేయలేకపోయారన్నారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తున్నారని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా ప్రవేశ­పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి పేద కుటుంబంలో సభ్యుడిగా మారారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. 

విద్యారంగానికి పెద్దపీట
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను అమలు చేయడం వల్ల పేద పిల్లలకు అవకాశాలు పెరగుతున్నాయని కృష్ణయ్య చెప్పారు. కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్లుగా తయా­రవడమే కాకుండా విదేశాలకు పెద్దఎత్తున పేద వర్గాల పిల్లలు వెళ్తున్నారని వివరించారు. విదేశీ విద్య కోసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సాయం కూడా అందుతోందన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల ప్రజలకు కేవలం సుత్తి, పార, ఇస్త్రీ పెట్టె వంటి పనిముట్లు ఇచ్చేందుకు పరిమితమైతే.. సీఎం వైయ‌స్ జగన్‌ రాష్ట్ర బడ్జెట్‌లోను, అధికారంలోను ప్రత్యేక వాటా ఇస్తున్నారని వివరించారు.   

వంగా గీత చేతిలో పవన్‌ ఓటమి : జూపూడి
ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు మాట్లా­డు­తూ.. రాష్ట్రంలో పేద వర్గాలు, పెత్తందార్ల మధ్య, ప్రోగ్రెసివ్, ఫ్యూడలిజం మధ్య, భూస్వామ్య వర్గాలు, పేదల పక్షాన నిలబడే వారి మధ్యే ప్ర­స్తుతం పోటీ జరుగుతోందన్నారు. ప్రజలు ఎవరి పక్షాన నిలబడాలో ఆలోచించుకుని ఓట్లు వేయా­లని కోరారు. పిఠాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పవన్‌ ఓడిపోతున్నారని చెప్పారు. పార్టీ పెట్టి మూసేసిన చిరంజీవిని పవన్‌ ఎన్నికల ప్రచారానికి తెచ్చుకుని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

Back to Top