'స్థానిక' రిజర్వేషన్లలోనూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు

ఉప్పాడ 15 జూన్ 2013:

కాంగ్రెస్, టీడీపీలకు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల దడ పట్టుకుందని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభజనం చూసి వారికి నిద్ర పట్టక, పంచాయతీ ఎన్నికలలో పరువు నిలుపుకోవడానికి అడ్డదారులను అన్వేషిస్తున్నారని ఆమె తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడలో శనివారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ను రాష్ట్ర స్థాయి అధికారగణం నెత్తిన వేసుకుని జిల్లా అధికారుల ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచే జాబితాను పంపారని ఆమె ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేయూతతో ఎదిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తమ పక్షాన ఉండరనే నిర్థారణకు కాంగ్రెస్, టీడీపీలు వచ్చాయనీ, ఈ కారణంగా ఎక్కువ మొత్తం జనరల్ కేటగిరీ సీట్లు కేటాయించి, ధనబలం ఉన్న వారిని గెలిపించుకునేందుకు యత్నిస్తున్నారనీ దీనివల్ల సామాజికంగా వెనకబడిన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందనీ శ్రీమతి షర్మిల చెప్పారు.
వీరి కుట్ర కారణంగా 21, 590 సర్పంచి పదవులలో బీసీలకు రిజర్వు చేయాల్సిన 7,344కు బదులు 6,929 పదవులు మాత్రమే దక్కే అవకాశముందన్నారు. అంటే వారు 415 పంచాయతీలను రిజర్వేషన్ కేటగిరీ నుంచి కోల్పోతాన్నారు. దివంగత మహానేత హయాంలో బీసీలకు 8400 సర్పంచి పదవులు దక్కిన విషయాన్ని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. బడుగుల జనాభా ఎక్కువగా ఉన్న విశాఖ, ఆదిలాబాద్, ఖమ్మం, గుంటూరు, వరంగల్, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో బీసీలకు 34 శాతం బదులు 25శాతమే అమలుచేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 1099 పంచాయతీలుంటే కేవలం 61 పంచాయతీలను మాత్రమే ఎస్టీలకు కేటాయించారన్నారు. అక్కడ గిరిజనులు ఎక్కువున్నా ఇన్ని తక్కువ సీట్లు కేటాయించడమేమిటని ఆమె ప్రశ్నించారు. కిరణ్ సర్కారు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తోందో వేరే చెప్పనవసరం లేదన్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నోరు విప్పకపోవాడానికి కారణం కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం కాదా అని నిలదీశారు.

ముఖ్యమంత్రిగారి జిల్లా అయిన చిత్తూరులో 34 శాతానికి బదులు 24 శాతం మాత్రం కేటాయిస్తున్నారన్నారు. అంటే ఇక్కడ బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాలో పది శాతం గండిపడిందని ఆమె చెప్పారు. ఎస్టీలకు 6     శాతానికి బదులు 4 శాతం ఇస్తున్నారనీ, ఎస్సీలకు దక్కాల్సిన 20 శాతం బదులు 1.35 శాతం తగ్గించారన్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.71 శాతం సీట్లకు బదులు 45.6 శాతం మాత్రమే కేటాయించారు. ఈ ఒక్క జిల్లాలోనే జనరల్ కేటగిరీకి 14.11 శాతం సీట్లు అదనంగా దక్కుతున్నాయన్నారు. టీడీపీ నేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు అయిన చంద్రబాబు సొంత జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తున్నారంటే ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు ఆలోచించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంటూ, బీసీల మీద తనకెంతో ప్రేమ ఉందనీ ప్రకటనలకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారనీ, నిస్సిగ్గుగా అన్ని కబుర్లు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి చేతలకొచ్చేసరికి ఆ వర్గాలకు మొండిచేయి చూపిస్తున్నరని శ్రీమతి షర్మిల విమర్శించారు.

చంద్రబాబు హయంలో జన్మభూమి అనీ, నోడల్ వ్యవస్థ అనీ చెబుతూ స్థానిక సంస్థలకు పూర్తిగా గండికొట్టారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. ఆయన స్థానిక సంస్థలకు ఏమాత్రం అధికారమివ్వలేదన్నారు. నోడల్ సంస్థకి కనీసం చట్ట బద్ధత కూడా లేదన్నారు. అయినా పెత్తనం ఆ అధికారుల చేతుల్లో పెట్టారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని మనసులో మాట అనే పుస్తకంలో రాసుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కానీ మహానేత హయాంలో స్థానిక సంస్థలకు జీవం పోశారని చెప్పారు. మంచినీరు, విద్య, వైద్యంలాంటి 12 అంశాలకు నిధులు కేటాయించారని తెలిపారు. సర్పంచులు, ఎమ్పీటీలు, జడ్పీటీసీలకు గౌరవవేతనాన్ని పెంచిన ఘనత రాజశేఖరరెడ్డిగారిదని ఆమె చెప్పారు. స్థానిక సంస్థలకు చెక్ పవర్, స్థానిక ప్రతినిధులకు ప్రొటోకాల్ పవర్ ఇచ్చిన ఘనకూడా దివంగత మహానేతదేనన్నారు. వారికి నాయకుణ్ణి ఎంచుకునే అవకాశాన్ని కూడా ఆయనే కల్పించారన్నారు. స్థానిక సంస్థలను వైయస్ఆర్ అంత గౌరవించారన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్, టీడీపీ నాయకులకు విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం కూడా తెలియదన్నారు. వీరు ఎస్సీ,ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న ఆలోచన కూడా లేదన్నారు. అందుకే నీచమైన కుమ్మక్కు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

కిరణ్, చంద్రబాబు పాలనను విమర్శిస్తూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఎలా పాలించారో విపులంగా వివరించారు శ్రీమతి షర్మిల. నాయకుడంటే ఇలా ఉండాలని డాక్టర్ వైయస్ఆర్ చేసి చూపించారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీలు ఎలా కుట్రలు పన్నిందీ ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. భారీ సంఖ్యలో హాజరైన ఈ సభ అనంతరం ఆమె 180వ రోజు పాదయాత్రను పిఠాపురం వద్ద ముగించి రాత్రి బసకు చేరుకున్నారు.
ప్రసంగం ఆద్యంతం కిరణ్, చంద్రబాబు పాలనపై విమర్శల బాణాలను శ్రీమతి షర్మిల సంధించారు. ఎన్టీరామారావుగారిని చంద్రబాబు ఎలా వంచించిందీ కూడా తెలియజేశారు.

Back to Top