అక్రమ కట్టడమే సీఎం అధికారిక నివాసమా?. 

అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానం ఇదేనా?. 

రాష్ట్ర ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నట్లు?.

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఫైర్‌

నాడు అవే నిర్మాణాలు చట్ట విరుద్ధమన్న టీడీపీ 

కూల్చివేస్తామని సీఎంగా చంద్రబాబు ప్రకటన 

కొన్నాళ్లకు విజయవాడకొచ్చి అదే ఇంట్లోనే స్థిర నివాసం 

ఎన్జీటీ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్‌

గుర్తు చేసిన పుత్తా శివశంకర్‌రెడ్డి

పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించాలి

హైడ్రా పనితీరుపై సీఎం రేవంత్‌ను పొగడటం వరకేనా!

చంద్రబాబు ఇంటి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన పుత్తా శివశంకర్‌రెడ్డి

తాడేపల్లి: నిబంధనలను ఉల్లంఘించి కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న సీఎం చంద్రబాబు, దాన్నిప్పుడు అధికారిక నివాసంగా ప్రకటించుకోవడం దేనికి సంకేతమని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వ విధానం ఇదేనా, చట్టాలను పరిరక్షించాల్సిన వ్యక్తే ఉల్లంఘించడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ దృష్టి సారించి చంద్రబాబు ఇంటి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివ‌శంక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

దేనికి సంకేతం?:
– చంద్రబాబు నివాసానికి సంబంధించి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. కరకట్ట మీద ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంటినే అధికారిక నివాసంగా ప్రకటించింది. 
– నది ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ, దాన్ని అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని ఏ విధంగా పరిగణించాలి?. ఏకంగా సీఎం నిబంధనలు ఉల్లంఘించడం దేనికి సంకేతం?.

నాడు తప్పు. నేడు ఒప్పు:
– ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్న నిర్మాణాలన్నీ అక్రమం అని, కాంగ్రెస్‌ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆ కట్టడాలను కూల్చేయాలంటూ నాడు  ఉమ్మడి రాష్ట్రంలో 2014లో టీడీపీ నాయకులే డిమాండ్‌ చేశారు. ఆ నిర్మాణాలపై అప్పుడు వారు నానా యాగీ చేశారు.
– నాడు పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, బాలవర్దన్‌రావు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో కూడిన కమిటీ విజయవాడకు వచ్చి, సబ్‌ కలెక్టరేట్‌లో మీటింగ్‌ నిర్వహించారు. వెంటనే ఆ నిర్మాణాలన్నీ కూల్చేయాలంటూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల ఇరిగేషన్‌ శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. 
– 2104 డిసెంబర్‌ 31న నాటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ బోటులో అధికారులు, విలేకరులందర్నీ వెంటబెట్టుకుని వెళ్లి, ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న (నాటి లింగమనేని ఎస్టేట్‌) ఇంటితో సహా అక్కడున్న నిర్మాణాలను చూపెడుతూ ఈ అక్రమ నిర్మాణాలన్నింటికీ నోటీసులు ఇస్తున్నామని ప్రకటించారు. 
– 2015, జనవరి 1న క్యాంప్‌ కార్యాలయంలో సీఎంగా చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ.. కాంగ్రెస్‌ నాయకులు నిర్మించిన ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ప్రకటించారు. కానీ కొద్దిరోజుల్లోనే విచిత్రంగా అక్కడే  చంద్రబాబు నివాసం ఏర్పరచుకున్నారు.  

నిబంధనలు ఏం చెబుతున్నాయి?:
– జాతీయ పర్యావరణవేత్తలు మేథాపాట్కర్, రాజేంద్రసింగ్‌ వంటి వారు ఇక్కడ పర్యటించి నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఈ నిర్మాణాలు కూల్చాలని చెప్పారు. 
– కరకట్టపై అక్రమ కట్టడాలను తొలగించాలని 2015లో చంద్రబాబు ప్రభుత్వాన్ని లోకాయుక్త ఆదేశించినా, బేఖాతరు చేశారు.
– ఎన్జీటీ నిబంధనల ప్రకారం నదీ తీర ప్రాంతాలు కాపాడేందుకు, అక్రమ కట్టడాలను తొలగించేందుకు 2019లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నోటీసులు ఇవ్వడం జరిగింది. 
– ఇన్ని కమిషన్లు చెప్పినా, ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, రెండు సార్లు వరదలొచ్చి ఇళ్లు మునిగినా చంద్రబాబు మాత్రం అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వరదలొచ్చినప్పుడు హైదరాబాద్‌ వెళ్లిపోయారే ఖాళీ చేయడం లేదు.
– ఎన్జీటీ నిబంధనల ప్రకారం నదికి 100 మీటర్ల వరకు ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు. అదే విధంగా నదీపరీవాహక చట్టం ఆర్సీ యాక్టు ప్రకారం కూడా నదీ ప్రవాహానికి దగ్గరగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, నిట్టనిలువుగా పెరిగే చెట్లను కూడా ఉంచకూడదని చెబుతోంది. 
– కృష్ణా నది వరద నీటి మట్టం గరిష్టంగా 22.60 మీటర్లు. ఆ ఎత్తుకు దిగువన ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అదే విధంగా 100 మీటర్ల నదీ తీరంలోపల కూడా ఉండకూడదు. 

స్విమ్మింగ్‌ పూల్‌ కోసం అనుమతి తీసుకుని..:
– కానీ చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటు అక్కడున్న నిర్మాణాలన్నీ 19.3 మీటర్ల లోపే. అంతే కాకుండా ఆయా నిర్మాణాలకు డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో వ్యర్థాలన్నీ కృష్ణా జలాల్లో కలిసి ఆ నీరు కలుషితం అవుతోంది.   
– నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఉంటున్న నివాసానికి స్విమ్మింగ్‌ పూల్, దుస్తులు మార్చుకునేందుకు చిన్న గది పేరుతో అనుమతి తీసుకుని జీ ప్లస్‌ వన్‌ నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అక్రమ నిర్మాణానికి రూ.40 కోట్లు ఖర్చు చేసి మరిన్ని హంగులు సమకూర్చుకున్నారు. 
– మొన్న విజయవాడ వరదల సమయంలో అర్ధరాత్రి బుడమేరు గేట్లు ఎత్తడానికి కూడా అసలు కారణం చంద్రబాబు నివాసం మునిగి పోతుందన్న భయంతోనేనని చాలా విమర్శలొచ్చాయి.  

అసలు ఈ నివాసం ఎవరిది?:
– ఈ అక్రమ నివాసం గురించి విమర్శలొచ్చినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి. 
– ఇది చంద్రబాబు ఇల్లా? లింగమనేని నివాసమా? ప్రభుత్వ నివాసమా? అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.
(అంటూ.. ఆ భవనంపై లింగమనేని రమేశ్, సీఎం చంద్రబాబు ఏమన్నారనే వీడియోలు ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు)

– ల్యాండ్‌ పూలింగ్‌లో ఈ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశామని, దాంతో తనకేమీ సంబంధం లేదని లింగమనేని చెప్పారు. 
– మరోవైపు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ బయట ప్రజావేదిక ప్రభుత్వానిది, ఆ ఇళ్లు మాత్రం లింగమనేనిది అని, దాంట్లో తాను అద్దెకు ఉంటున్నానని అన్నారు.
– ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తే అక్రమ నిర్మాణంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమవుతుంది. 

పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?:
– అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. కేరళలోని  కొచ్చిన్‌లో 2020 జనవరిలో వేలాది కోట్లు వెచ్చించి నిర్మించిన లగ్జరీ నిర్మాణాలను పర్యావరణానికి అడ్డుగా ఉన్నాయనే కారణంతో నేలమట్టం చేశారు.  
– పంచాయతీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌.. వీటిపై మాటలు చెప్పడమేనా?. చేతలేమైనా ఉంటాయా?. లేక అసలు చర్యలు తీసుకోవడం ఉండదా?. 
– పొరుగున తెలంగాణలో హైడ్రా పేరుతో కాల్వలు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డిని పొగిడిన పవన్‌కళ్యాణ్, తన శాఖలో జరుగుతున్న అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకోలేరా? 
– ఇప్పటికైనా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చేయడానికి పూనుకుంటారా? లేదా? అని పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.

Back to Top