పచ్చ మీడియా అండతో అవినీతి

హైదరాబాద్) ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా టీడీపీ విప‌రీత‌మైన అవినీతికి పాల్ప‌డుతోంద‌ని
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. కేవ‌లం కొన్ని
ప‌త్రిక‌ల అండ‌తోనే విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.
ప్ర‌తిప‌క్ష పార్టీ అవినీతిపై ప్ర‌శ్నిస్తే సైతం వాటిపై స్పందించిన దాఖాలాలు లేవ‌న్నారు.

వైయస్సార్ ది స్పష్టమైన మార్గం

గ‌తంలో దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో అవినీతి ఆరోపణలు చేస్తే, వాటి
మీద    అర్థ‌రాత్రి
వ‌ర‌కు చ‌ర్చలు జ‌రిపించిన ఘ‌న‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ద‌క్కింద‌న్నారు. ప‌త్రిక‌లు
అనుకూలంగా లేన‌ప్ప‌టికి ఆయ‌న ప్ర‌జాసేవ‌కే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని గుర్తు చేశారు.
రింగ్‌రోడ్డు నిర్మాణ స‌మ‌యంలో   సింగిల్ కోడ్ టెండ‌ర్లు పిలిచార‌ని బాబు ఆరోప‌ణలు చేస్తే దానిపై సీబీఐ విచార‌ణ
వేయించిన ఘ‌న‌త వైయ‌స్సార్‌ది అని శ్రీ‌కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప‌రిటాల హ‌త్య
స‌మ‌యంలో సైతం ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడితే దానిపై సైతం సీబీఐ విచార‌ణ వేశార‌న్నారు.
మ‌రి ఇప్పుడు రాజ‌ధాని భూముల విష‌యంలో అవినీతి జ‌రుగుతోంద‌ని వైయ‌స్సార్‌సీపీ ప్ర‌శ్నిస్తే
దానిపై సీబీఐ విచార‌ణకు ఆదేశించ‌కుండా... మీరు అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నార‌ని
ఆరోప‌ణలు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న బాబును నిల‌దీశారు. 

అన్నహాజ‌రే వారసుల‌మ‌న్న బాబు

ప్రాజెక్టుల‌లో సైతం వేలాది కోట్ల అవినీతి జ‌రుగుతోంద‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట
పెట్టినప్పటికీ చంద్రబాబు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తున్నార‌న్నారు. అన్నా
హజారే కు వార‌సుల‌మ‌న్న బాబు ఇప్పుడు ఎందుకు అవినీతికి పాల్ప‌డుతున్నార‌న్నారు.
ఇప్ప‌టికైనా బాబుకు చిత్త‌శుద్ధి ఉంటే ప్రాజెక్టులు, రాజ‌ధాని భూముల‌పై జ‌రుగుతున్న అవినీతిపై
సీబీఐ విచార‌ణ కానీ,
శ్వేత‌ప‌త్రాలు
కానీ విడుద‌ల చేయాల‌ని సూచించారు. ప్ర‌శ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నార‌ని
ఆరోపించారు. బాబులాగే అధికారులు సైతం త‌ప్పులు చేస్తూ వంత పాడితే భ‌విష్య‌త్తులో
ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. బాబు అవినీతికి
కొమ్ముకాస్తున్న అధికారుల‌పై సైతం వైయ‌స్సార్‌సీపీ పోరాడుతుంద‌న్నారు. 

Back to Top