ముందేం చేశావని బాబును నిలదీయండి

కందుకూరు/సింగరాయకొండ (ప్రకాశం జిల్లా):

‘ఈ ఎన్నికల అనంతరం టీడీపీ కనుమరుగు అవక తప్పదని చంద్రబాబుకు తెలుసు. 65 ఏళ్ల చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు. అందుకే ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ జగన్ సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ కేంద్రంలో, కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో జరిగిన వై‌యస్ఆర్ జనభేరి సభలకు హాజరైన అశేష జనప్రభంజనాన్ని ఉద్దేశించి ‌ప్రసంగించారు.

'వ్యవసాయ రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం అంటూ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో చంద్రబాబు మీ ముందుకు వచ్చినప్పుడు... తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీయండి. కరెంటు చార్జీలు తగ్గించమన్న రైతులపై బషీర్‌బాగ్‌లో తుపాకి గుళ్లు కురిపించిందెవరని ప్రశ్నించండి. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిందెవరని అడగండి. 65 ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి 26 వేల మందిని వీధులపాలు చేసిందెవరని నిలదీయండి’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

'దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను పుణికిపుచ్చుకున్నవాణ్ణి. చంద్రబాబులా ‌అబద్ధపు హామీలివ్వను. ఇచ్చిన హామీలను నిలుపుకొనేందుకు ఎందాకైనా వెళతా. నేను యువతరం ప్రతినిధిని. సమర్థమైన పాలన అందిస్తా. రాజశేఖరుని సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తా. మన తలరాతలు మార్చే సార్వత్రిక ఎన్నికలు మరో 16 రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుళ్లు, కుట్ర రాజకీయాలకు చరమగీతం పాడండి. వైయస్ఆర్ అందించిన విశ్వసనీయతకు పట్టం కట్టండి. పేదవాడి గుండెచప్పుడు వినే.. ప్రజల మనసెరి‌గి నడుచుకునే నాయకుడిని సీఎంగా ఎన్నుకోండి. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రం దశ, దిశ మారుస్తా :

‌'వైయస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయత సాక్షిగా చెపుతున్నా. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే చేయబోయే ఐదు సంతకాలు రాష్ట్ర దశ, దిశను మారుస్తాయి. అక్కాచెల్లెళ్లు ఆరు, ఏడు తరగతి చదువుతున్న పిల్లలను చదివించే స్థోమత లేక కూలి పనులకు తీసుకెళ్తున్నారు. అక్కాచెల్లెళ్లను ఆ కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. ఇద్దరు పిల్లలను బడికి పంపితే అక్కాచెల్లెళ్ల ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేస్తా. నా అవ్వాతాతలకు ఓ మనవడిగా భరోసా ఇస్తున్నా. నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండ‌వ సంతకం చేయబోతున్నా. రైతన్నల కోసం మూడవ సంతకం చేయబోతున్నా. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి ఏటా రూ.2 వేల కోట్లతో సహాయ నిధి ఏర్పాటుచేస్తా. నా అక్కాచెల్లెళ్ల కోసం నాలుగవ సంతకం చేయబోతున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, మరే కార్డు కావాలన్నా మీ ఊర్లో, మీ వార్డులోనే 24 గంటల్లోగా ఇప్పించేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయించేలా ఐదవ సంతకం చేస్తా.

ప్రజా సేవలో మూడు రకాల అంబులెన్సులు :
'మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రె‌స్ ‌ప్రభుత్వం నీరుగార్చింది. 108, 104 సర్వీసులకు నిధులివ్వకుండా మూలన పడేసింది. నేను అధికారంలోకి రాగానే రాజన్న పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తా. అనారోగ్యంతో ఉన్న వారు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో ఇంటి వద్దకు వచ్చేలా 108 సర్వీసులను మెరుగుపరుస్తా‌. రైతన్నకు తన పొలంలో భూసారం ఎంతుందో? ఏ ఎరువులు ఏ మోతాదుల్లో వాడాలో? ఏ పైరు వేసుకోవాలో తెలిపేందుకు 103ని ప్రవేశ పెడతా. రైతు 103కి ఫోన్ చేయగానే శాస్త్రవేత్తలు ఆ రైతు పొలం వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి సలహాలు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తా‌. పాడి పశువులు జబ్బుపడితే 102కు ఫోన్ చేస్తే చాలు.. 20 నిమిషాల్లో పశువైద్యులు వచ్చి ఆ పశువుకు వైద్యం చేసేలా వినూత్న పథకాన్ని అమలు చేస్తా‌. 2019 నాటికి ఏ గ్రామంలోనూ ఇళ్ళు లేని వారు లేకుండా చేస్తా' అన్నారు.

'‌దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 47 లక్షలు ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారు. ఆయన స్ఫూర్తితో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాదు.. ఆ ఇంటి పట్టాలు అక్కా చెల్లెళ్ల పేరు మీద  రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తా.‌  వైయస్ రాజశేఖరరెడ్డి స్వప్నమైన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నీరుగార్చింది. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. నేను ముఖ్యమంత్రినయ్యాక వీటన్నిటినీ చేర్చి ఆరోగ్యశ్రీని మరింత బాగా అమలు చేస్తా. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినవారు డాక్ట‌ర్ సూచన మేరకు వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.మూడు వేల చొప్పున సహాయంగా అందిస్తా‌' అని భరోసా ఇచ్చారు.

ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి ఇప్పుడు బిల్లు రూ.550 వరకూ వస్తోంది. ఆ బిల్లులు కట్టలేని దుస్థితిలో పేదలు ఉంటే.. కరెంట్ కనెక్షన్ క‌ట్ చేస్తున్నారు. దొంగ కనెక్ష‌న్ తీసుకుని పేదలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. నేను ముఖ్యమంత్రినయ్యాక ఒక టీవీ, రెండు ఫ్యా‌న్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి అవసరమైన 150 యూనిట్లు రూ.100కే ఇస్తా. వ్యవసాయానికి పగటి పూట ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా 2019 నాటికి విద్యు‌త్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నా‌' అన్నారు.

'ముఖ్యమంత్రి అయ్యాక బెల్టు షాపులను మూసివేయిస్తా. బెల్టుషాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పదిమంది మహిళా పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఒక చోటే మద్యం దుకాణం ఉంటుంది. ఆ షాపును కూడా ప్రభుత్వమే నడుపుతుంది. మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటాయి. చంద్రబాబు తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. సొంత తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడతానో అదే రీతిలో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తా‌' అని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు.

Back to Top