వెంటాడి వేటాడి చంపుతున్నారు

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల వైఎస్సార్ సీపీ నేత ప్రసాదరెడ్డిని హతమార్చారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు.

సీఎం చంద్రబాబు గద్దె నెక్కిన నాటి నుంచి జరుగుతున్న వరుస దాడులు, రాజకీయల హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సర్కారు  హత్యలను ప్రోత్సహిస్తోందన్నారు. చంద్రబాబు తొమ్మిది నెలల పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలను ఎలా వెంటాడి చంపుతున్నారో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో నిలదీసినా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.
 
ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో దాడి చేసి చంపిన తీరు చూస్తుంటే టీడీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు హింసకు నిలయాలుగా మారాయని తేటతెల్లమవుతోందన్నారు. రాజకీయ హత్యలకు పాల్పడే వారికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎలా ఉపయోగపడుతున్నారో ప్రసాదరెడ్డి హత్యే నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయనకులను అంతమొందించడం ద్వారా సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
Back to Top