తనను చూడాలని 2 కిలోమీటర్లు పరుగెత్తుకొచ్చిన బాలికను అక్కున చేర్చుకున్న జగన్భావోద్వేగంతో బాలిక కన్నీటిపర్యంతంశ్రీకాకుళం : ఈ పాప పేరు పేడాడ లలిత. ఊరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గుంజిలోవ. జర్జంగి స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తమ ప్రాంతానికి పాదయాత్రగా తొలిసారి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఎలాగైనా చూడాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులను ఆయన దగ్గరకు తీసుకువెళ్లమని కోరింది. అంత జనంలో కుదరకపోవచ్చమ్మా అని ఆమె తండ్రి ఢిల్లీశ్వరరావు నచ్చచెప్పాలని చూశాడు. వినలేదు. జగన్‌ను ఏది ఏమైనా చూసి తీరాలనే పట్టుదలతో లలిత బుధవారం గుంజిలోవ నుంచి పాదయాత్రను అనుసరించింది. అర కిలోమీటర్ నడిచినా కుదరలేదు. ఈలోపు పాదయాత్ర కొత్తపేట క్రాస్ చేరుకుంది. జగన్‌ను చూడాలని, కలిసి మాట్లాడాలని మనసులో గట్టిగా సంకల్పించుకున్న లలిత ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వగర్చుకుంటూ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని జగన్ దరిచేరి బావురుమంది. ఏమైందో అర్థం కాక వైఎస్ జగన్ లలితను దగ్గరకు తీసుకుని.. ఏమైంది తల్లీ.. ఎందుకు ఏడుస్తున్నావ్.. అని అడిగాడు. అంతే ఆ పాప తీవ్ర భావోద్వేగానికి లోనైంది. పరుగెత్తి రావడంతో ఓపక్క గసపెడుతూ మరోపక్క వెక్కివెక్కి ఏడుస్తూ జగన్‌ను నడుంచుట్టేసుకుంది.దాంతో చలించిపోయిన జగన్... ఏమైందమ్మా, ఎందుకు బాధ పడుతున్నావ్.. అంటూ సముదాయించారు. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారందరూ స్థాణువులయ్యారు. నిశ్శబ్ధం ఆవరించింది. అప్పుడా బాలిక.. ‘నిన్ను చూసి వస్తానని మా అమ్మానాన్నతో పందెం కట్టి వచ్చానన్నా.. రెండు కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ రావడంతో అలుపొచ్చి ఏడుపొచ్చింది’ అనడంతో ఆ పాపను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. వాత్సల్యంతో కొన్ని క్షణాల పాటు ఆ పాప తలనిమిరి.. ఇప్పుడు చూశావ్‌గా నాన్నా.. బాధ పడకు, నీకు నేనున్నా, బాగా చదువుకోమంటూ ఓదార్చారు. కాలు నొప్పెడుతుందామ్మా.. అంటూ కాలు పట్టుకుని తడిమి చూసి.. అయ్యో, చెప్పులు కూడా తెగిపోయాయా తల్లీ? అంటూ ఓ తండ్రి.. కూతురును దగ్గరకు తీసుకున్నట్లు అక్కున చేర్చుకుని వీపు నిమిరారు. దీంతో లలిత మరింత భావోద్వేగానికి లోనైంది. ‘అన్నా.. నిన్ను చూశాను, అదే చాలు’ అంటూ ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. జగన్ బుగ్గ నిమిరి ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత జగన్ ఆ పాప వివరాలు అడిగారు. అన్ని వివరాలు చెప్పింది. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారని, తాను చదువుకుంటున్నానని, ఎలాగైనా సరే జగన్‌ను చూడాలన్నదే తన పట్టుదల అని చెప్పింది. ఆ బాలిక చూపిన ప్రేమ, అప్యాయతలతో ఉక్కిరిబిక్కిరయిన జగన్ కొన్ని క్షణాలపాటు మౌనం దాల్చారు.నీ లాంటి చిట్టితల్లులే నా ప్రాణం.. అంటూ అనురాగం చూపి లలితను జాగ్రత్తగా తన రోప్ నుంచి బయటకు పంపించారు. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నంత సేపు మౌనంగా వీక్షించిన చుట్టుపక్కల వారందరూజై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అవును.. నాయకుడంటే ఇలా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన తర్వాత లలిత తల్లిదండ్రులు మాలతీ, ఢిల్లీశ్వరరావులు సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ మేము చేయలేనిది మా పాప చేసిందంటూ సంబరపడ్డారు. జగనన్నను ఎలాగైనా చూసి వస్తానని లలిత ఇంట్లో పందెం కాసి వెళ్లిందని చెప్పారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎంతో ప్రేమని, అందుకే తాము తిత్లీ తుపాన్ నష్టపరిహారంతో సహా చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యామన్నారు. అయినా బాధ లేదని, జగన్ సీఎం అయితే చాలని ఆకాంక్షించారు.