'ఎఫ్‌డిఐలను స్వాగతించిన చంద్రబాబే దోషి'

హైదరాబాద్‌, 8 డిసెంబర్‌ 2012: దేశంలోని చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) కు దారులు తెరిచిన విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రథమ ముద్దాయి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ఎఫ్‌డిఐలకు తాము వ్యతిరేకం అని చెబుతూ, పాదయాత్రలో తిట్టుకుంటూ పరోక్షంగా చంద్రబాబు మద్దతు వాటికి తలుపులు తెరిపించారని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తూర్పారపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడుతూ, తనపై వచ్చిన అవినీతి కేసుల్లో విచారణ లేకుండా చంద్రబాబు చేసుకుంటున్నారని గట్టు ఆరోపించారు.  ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ - టిడిపి మధ్య జరిగిందే నిజమైన 'క్విడ్‌ ప్రొ కో' అని ఆయన దుయ్యబట్టారు. టిడిపి కాంగ్రెస్‌ పార్టీలు ‌ఏకమైపోయి 'సైకిల్‌ కాంగ్రెస్‌ పార్టీ'గా మారాయని గట్టు ఆరోపణాస్త్రాలు సంధించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగ్‌లో టిడిపి సభ్యులు గైర్హాజరవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇద్దరు టిడిపి సభ్యులు సభలోనే ఉండి, మరో ముగ్గురు గైర్హాజరవడం అంటే ఎఫ్‌డిఐలను, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆహ్వానించడమే అన్నారు.

ఎఫ్‌డిఐలపై ఓటింగ్‌కు టిడిపి సభ్యులు సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్‌, గుండు సుధారాణి గైర్హాజరవడం చంద్రబాబు ఆడిన డ్రామాలో భాగమే అని గట్టు రామచంద్రరావు దుమ్మెత్తిపోశారు. నిజానికి చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాయబారం నడిపింది సుజనాచౌదరే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులకు బినామీ సుజనాచౌదరే అన్నారు. చంద్రబాబుకు ఆత్మలాంటి సుజనాచౌదరి తన పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా గైర్హాజరయ్యే ప్రశ్నే లేదన్నారు. అప్పటి వరకూ రాజ్యసభలో ఉన్న ఈ ముగ్గురు సభ్యులు ఓటింగ్‌ సమయంలో సభ నుంచి వెళ్లిపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎఫ్‌డిఐలకు తాము వ్యతిరేకం అంటూ బయట ప్రజలకు మోసపు మాటలు చెప్పిన చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇలా సిగ్గులేని డ్రామా ఆడారన్నారు. టిడిపిలో ఎందరో అర్హులు, సీనియర్లు ఉన్నప్పటికీ కేవలం డబ్బున్నవాడనే సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వాన్న చంద్రబాబు కట్టబెట్టిన వైనాన్ని ఆ పార్టీలోని సీనియర్లే బాహాటంగా విమర్శించిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు.

ఎఫ్‌డిఐలకు అనుకూలంగా వ్యవహరించేందుకు చంద్రబాబు నాయుడు ఎన్ని వందల లారీల నోట్ల కట్టలకు అమ్ముడుబోయారో వెల్లడించాలని గట్టు డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ ఫుడ్సుకు భూమికి సంబంధించిన బాగోతం అందరికీ తెలిసిందే అన్నారు. మూడున్నర కోట్ల విలువైన భూములను హెరిటేజ్‌లో పెట్టి ఆ భూమి విలువ రూ.80 కోట్లుగా చూపించి మహారాష్ట్రకు చెందిన సంస్థకు షేర్లు విక్రయించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అలాగే కోకాపేట భూములను కూడా అధిక ధర చూపించి మహారాష్ట్ర సంస్థకు తాకట్టు పెట్టింది సుజనాచౌదరి కాదా అని ఆయన నిలదీశారు.

మళ్ళీ ఓ మీడియా డ్రామా:
తనను కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని, చంద్రబాబుకు చెప్పే తాము ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని దేవేందర్‌గౌడ్‌ చెబుతుంటే, టిడిపికే చెందిన మరో నాయకుడు మీడియాలో సిగ్గు, శరం ఉంటే ఆ ముగ్గురు రాజ్యసభ సభ్యులూ పార్టీకి రాజీనామి చేయాలంటూ ప్రకటనలు గుప్పించడం కేవలం చంద్రబాబు నాయుడి డ్రామా తప్ప మరొకటి కాదన్నారు. తనపై ఉన్న కేసులను విచారించకుండా చూసుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారని ఆరోపించారు. 'నీ ప్రభుత్వాన్ని నేను కాపాడతాను. నా మీద కేసులు లేకుండా చేయమంటూ కాంగ్రెస్‌ పార్టీలో చంద్రబాబు చేసుకున్న అసలైన క్విడ్‌ ప్రొ కో ఇదే అన్నారు. చంద్రబాబు నిర్దోషి అని చూపించేందుకు ఒక వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు.

టిడిపి - కాంగ్రెస్‌ పార్టీల మధ్య అవగాహన ఒక వైపున స్పష్టంగా తెలిసినా ఒక మీడియా మాత్రం చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నదని దుయ్యబట్టారు. ఆయనకు తెలియకుండానే ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యరనే అర్థం వచ్చేలా 'సైకిల్‌ గాలి తీసేశారు' అంటూ వార్త రాయడాన్ని ఎద్దేవా చేశారు. పైగా ఎంపీల వైఖరితో చంద్రబాబు షాక్‌ అయ్యారంటూ సన్నాయి నొక్కులు ఆ పత్రిక నొక్కిందన్నారు. నిజానికి ఎఫ్‌డిఐలపై ఓటింగ్‌కు టిడిపి సభ్యులు గైర్హాజరవడంతో ప్రజలు షాక్‌ తిన్నారన్నారు. రాజ్యసభలో శుక్రవారంనాడు ఓటింగ్‌ ముగిసిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందన్న ధీమాయే చంద్రబాబులో కనిపించిందన్నారు. ఆదిలాబాద్‌జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన బిల్లు నెగ్గిందన్న విషయం తెలిసిన వెంటనే కుర్చీలో కూర్చొని, మరో కుర్చీలో కాలుపెట్టుకుని, వాటిని ఊపుతూ చాలా ధీమాగా ఉన్నారన్నదానికి రుజువుగా ఆ విడియో చిత్రాన్ని టివిలో గట్టు ప్రదర్శించి చూపించారు. ఓటింగ్‌లో బిల్లు నెగ్గిన విషయం తెలిసిన తరువాత గంటసేపు ఒంటరిగా గదిలో కూర్చొని చంద్రబాబు ఎవరితో మాట్లాడారు, ఏమి చర్చలు జరిపారో తెలపాలని గట్టు డిమాండ్‌ చేశారు.

ఎఫ్‌డిఐని చంద్రబాబు ఆహ్వానిస్తున్నారని, బయట ప్రజలను మోసగిస్తున్నారని గట్టు ఆరోపించారు. ఎఫ్‌డిఐలు వస్తే హెరిటేజ్‌ను దానికి అనుబంధం చేయాలని చంద్రబాబు యత్నాలు చేస్తున్నారని అన్నారు. లోపల ఒకటి చేసి, బయట మరొకటి మాట్లాడి ప్రజలను మోసగించాలని చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అశేష ప్రజాదరణను చూసి కాంగ్రెస్‌ - టిడిపిలు ఏకమయ్యాయని అన్నారు. ఆ రెండు పార్టీల పొత్తులూ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.

పాదయాత్ర పేరుతో ఊళ్ళల్లో తిరుగుతున్న చంద్రబాబు ఇంకా ప్రజలకు చెప్పేదేమి ఉందని ప్రశ్నించారు. ఓటింగ్‌ను బహిష్కరించడం అంటే కాంగ్రెస్‌ పార్టీని సమర్థించడం కాక మరేమిటి అని ఒక విలేకరి ప్రశ్నకు గట్టు బదులిచ్చారు. వెన్నుపోట్లకు చంద్రబాబే నిజమైన ఉదాహరణ అని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. చంద్రబాబుపై విచారణకు సిబ్బంది, నిధులు లేవని తప్పించుకున్న సిబిఐ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల విషయంలో ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడాన్ని గట్టు ప్రశ్నించారు.

Back to Top