రాజ్యసభలో మరింత కీలకంగా వైయ‌స్ఆర్ సీపీ!

న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్‌ ఎంపీలైన నలుగురు రాకేష్‌ సిన్హా, రామ్‌ షకల్‌, సోనాల్‌ మాన్‌సింగ్‌, మహేష్‌ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు.  వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. 

అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13, ఆమ్‌ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10  మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, పలువురు నామినేటేట్‌ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారు

అయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. ఎన్డీయేకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నాడీఎంకే, ఏపీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి. కాగా ఈ రెండు పార్టీల ఎంపీలను( అన్నాడీఎంకే 4, వైయ‌స్ఆర్ సీపీ11) కలిపిన మొత్తం 101 అడంతో బిల్లులు ఆమోదం పొందడానికి మరో 13 మంది ఎంపీల బలం అవసరం

కాగా వైయ‌స్ఆర్ సీపీ(11), అన్నాడీఎంకే (4) ఇప్పటి వరకు బిల్లుల అమలు సమయంలో ఎన్డీయేకు మద్దుచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్‌లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లుల ఆమోదం విషయంలో గట్టెక్కాలంటే వైయ‌స్ఆర్ సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పక అవసరం.  రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న  వైయ‌స్ఆర్ సీపీ నుంచి ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు లభించనుంది.​ 

ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజూ జనతాదళ్‌ పార్టీ కూడా ఎన్నికల ముందు పార్టీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్  సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి  వైయ‌స్ఆర్ సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.

అన్నాడీఎంకే, నవీన్‌ పట్నాయక్‌కు చెందిన బీజేపీ.. అధికార పార్టీకి మద్దతు ఇవ్వకుంటే బీజేపీ నామినేటెడ్‌ సభ్యుల ఓట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో 12 మంది నామినేటెడ్‌ సభ్యులు ఉన్నారు. అయితే వీరు పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ ప్రభుత్వమే ఎంపిక చేసినందుకు బిల్లుల ఆమోదంలో వారు అధికార పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు. వీరితోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంపీలు, స్వతంత్రులు కూడా కీలకంగా మారారు.

ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్‌లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో  మరో రెండు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్‌ సభ్యుల ఓట్లు,   వైయ‌స్ఆర్ సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది.

Back to Top